శేరిలింగంపల్లి జోన్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శేరిలింగంపల్లి జోన్​లో  అక్రమ నిర్మాణాల కూల్చివేత

మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. బల్దియా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్ డివిజన్​లోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, కొండాపూర్​ శ్రీరాంనగర్​ ఏ, బీ బ్లాక్స్​, మియాపూర్​, చందానగర్​, నల్లగండ్ల ఏరియాల్లో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి.

మంగళవారం జోనల్ స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ మూడు టీమ్స్​గా విడిపోయి అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టారు. ఒక్క మాదాపూర్​ అయ్యప్పసొసైటీలోనే 30 వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం నాలుగు నిర్మాణాలను కూల్చివేశారు. చందానగర్​ డీసీ వంశీకృష్ణ, ఏసీపీ రాజ్​కుమార్​ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. ఈ డ్రైవ్​ అన్ని డివిజన్లలోనూ కొనసాగుతుందని తెలిపారు.

 నామ్ కే వాస్తేగా.. 

అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టిన అధికారులు నామ్ కే వాస్తేగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టౌన్​ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు ముందుగానే అక్రమ నిర్మాణదారుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని నిర్మాణాలకు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కూల్చివేతలు చేపట్టాలని అదేశాలతో అక్రమ నిర్మాణల వద్దకు చేరుకున్న సిబ్బంది కేవలం గోడలకు రంధ్రాలు చేయడం

ప్రహరీలను కూల్చేయడం మాత్రమే చేశారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి పర్మిషన్ బిల్డింగ్ నిర్మాణం చేపడితే పూర్తిగా దాన్ని నేలమట్టం చేయాల్సింది పోయి నామ్ కే వాస్తేగా చర్యలు తీసుకోవడమేంటని మండిపడుతున్నారు.