తెలంగాణలో రాక్షస పాలన నడుస్తున్నది : ఏనుగు సుదర్శన్ రెడ్డి

తెలంగాణలో రాక్షస పాలన నడుస్తున్నది : ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్​కేసర్, వెలుగు:  అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, 26 వేల జీతం ప్రకటించాలని రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్​ చేశారు.  ఘట్ కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం 11వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన పాల్గొని వారికి మద్దతు తెలిపి మాట్లాడారు.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, కిందిస్థాయి ఉద్యోగులను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. వీళ్ల సమస్యలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పట్టించుకోరా.. ? అని  ప్రశ్నించారు.  అంగన్​వాడీల న్యాయమైన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కట్ట జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి రావుల శ్రీకాంత్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు శివ నాయక్, పోచారం మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గుండె నరేశ్, ఘట్ కేసర్ మున్సిపల్ బీజేవైఎం ఉపాధ్యక్షుడు అనిల్, అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.