ప్రాణాలు తీస్తున్న  డెంగీ జ్వరాలు

ప్రాణాలు తీస్తున్న  డెంగీ జ్వరాలు
  • వారంలో 20 మంది మృతి 
  • ఒక్క ఆగస్టులోనే 1,720 కేసులు నమోదు
  • డెంగీతో ఒక్కరు కూడా చనిపోలేదంటున్న సర్కార్‌‌
  • వైరల్ ఫీవర్లతో ఓపీలకు క్యూ కడుతున్న జనం
  • దోమల నివారణకు చర్యలు తీసుకుంటలేరంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నయ్‌. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,509 డెంగీ కేసులు, 608 మలేరియా కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ రిపోర్ట్‌ చెబుతోంది. ఇందులో ఒక్క ఆగస్టులోనే 1,720 డెంగీ, 116 మలేరియా కేసులు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో కేవలం 140 కేసులు నమోదైతే, ఈ ఏడాది 12.3 రెట్లు ఎక్కువ కేసులు రికార్డయ్యాయి. డెంగీ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా డెంగీ మరణాలు సంభవించాయి. అయితే ఇంతకంటే ఎక్కువగానే మరణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మృతుల్లో చిన్న పిల్లలు, యువత ఎక్కువగా ఉంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఐదు రోజుల కింద 8 ఏండ్ల బాలుడు, మూడ్రోజుల కింద కొత్తగూడెం జిల్లా గరీబ్‌పేటలో 8 ఏండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు

అదే జిల్లాకు చెందిన 21 ఏండ్ల యువతి రెండ్రోజుల క్రితం మరణించింది. ఇలా ఎంతో మంది విష జ్వరాలకు బలవుతున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకుంట లేదు. మరోపక్క ఆరోగ్య శాఖ లెక్కల్లో డెంగీ, మలేరియా మరణాలు జీరోగా చూపిస్తున్నారు. జ్వరాలతో ఎవరూ చనిపోవడం లేదని చెబుతున్నారు. ఆరోగ్య శాఖ చెబుతున్న దాని కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా కేసులు వస్తున్నాయని, పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని గ్రౌండ్‌ లెవల్‌లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లు, డాక్టర్లు చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతూ జిల్లా దవాఖాన్లకు వస్తున్న ఔట్‌ పేషెంట్ల సంఖ్య రోజుకు 6 వేలకుపైనే ఉంటోందన్నారు. 
అధికారులు పట్టించుకుంటలే
దోమల నివారణ చర్యలు చేపట్టాల్సిన పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో దోమ లార్వాపై హెల్త్ ఆఫీసర్లు ఓ సర్వే నిర్వహించారు. ఇండ్లు, వీధుల్లో నిలిచి ఉన్న నీళ్లలో డెంగీ కారక దోమల లార్వా ఉందో, లేదో పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సేకరించిన 58.9 శాతం శాంపిళ్లలో డెంగీ కారక ఏడిస్ దోమ లార్వా ఉన్నట్టు గుర్తించారు. మేడ్చల్‌లో 57.7 శాతం, మహబూబ్‌నగర్‌‌లో 46.2, రంగారెడ్డిలో 46 , ఆదిలాబాద్‌లో 44.5, వరంగల్ అర్బన్‌లో 41.4, వరంగల్ రూరల్‌లో 40 శాతం శాంపిళ్లలో ఏడిస్ లార్వా ఉన్నట్టు తేల్చారు. మొత్తం 33 జిల్లాలకు గాను 8 జిల్లాల్లో 35 శాతానికిపైగా శాంపిళ్లలో ఏడిస్ లార్వా ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో దోమలు ఉంటే డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 30 శాతానికి పైగా శాంపిళ్లలో లార్వా ఉంటే, ప్రమాదకర స్థాయిగా గుర్తించి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.