
- ఈ ఏడాది మొత్తం 40 కేసులు
- వైరల్ ఫీవర్‌తో వచ్చినవారికి టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్
- ప్లేట్లెట్స్ పడిపోతుండటంతో ఆందోళన
- వనపర్తి జిల్లాలో పరిస్థితి
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో పదేండ్ల బాలుడికి డెంగ్యూ పాజిటివ్వచ్చింది. చికిత్స అందించాక కోలుకున్నాడు. వారం రోజుల కింద అమరచింత మండల కేంద్రంలోనూ ఓ విద్యార్థి డెంగ్యూ బారిన పడ్డాడు. వైద్య సిబ్బంది వీరి ఇళ్లకు వెళ్లి, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. బాధితుల ఇళ్లతోపాటు చుట్టుపక్కల పైరిత్రం మందు స్ప్రే చేయించారు.’
వనపర్తి, వెలుగు: జిల్లాలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 40 మందికి పాజిటివ్వచ్చినట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పేషెంట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందినవారు మాత్రమే. ప్రైవేట్హాస్పిటల్స్కు వెళ్లిన వారిని లెక్కిస్తే 100కు పైనే ఉండొచ్చని సమాచారం.
పెరుగుతున్న ఓపీ..
వానాకాలం సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ రోజు 900కు పైగా ఓపీ నమోదవుతోంది. పేషెంట్లలో ఎక్కువ మందికి వైరల్ ఫీవర్ ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. వైద్య పరీక్షలు చేస్తే టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఒక్కసారిగా ప్లేట్ లెట్లు పడిపోతుండటంతో బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పలువురు ప్రైవేట్హాస్పిటల్స్కు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.
గోపాల్‌పేటలో ఎక్కువ కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల పరిధిలో డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. ఎక్కువగా గోపాల్పేట మండలంలో 8 మందికి, పెబ్బేరు మండలంలో ఐదుగురికి పాజిటివ్వచ్చినట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఒక్క ఆగస్టులోనే 28 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది.ఈ నెలలోఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో మురుగు కాలువలు ఉప్పొంగి ప్రవహించాయి. ఓపెన్ఏరియాలు మడుగులుగా మారి దోమలు పెరిగాయి. దీంతోపాటు పరిసరాల అపరిశుభ్రతతో ప్రజలకు జ్వరాలు వస్తున్నాయి.