కౌలు రైతు కష్టాలపాలు... గుర్తించని తెలంగాణ సర్కారు

కౌలు రైతు కష్టాలపాలు... గుర్తించని తెలంగాణ సర్కారు
  • అందని రుణాలు, రాయితీలు
  • జారీ కాని గుర్తింపు కార్డులు
  • కౌలునామా ఇవ్వకనే ఈ దుస్థితి
  • తామెందుకు ఇవ్వాలంటున్న భూయజమానులు

భద్రాచలం, వెలుగు:  కౌలు రేట్లు పెరగడం, పంటల సాగుకు పెట్టుబడులు భారంగా మారుతుండడంతోపాటు ప్రభుత్వం కూడా  ఎలాంటి సాయం చేయకపోవడం లేదు. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. రుణాలు దొరక్క, గుర్తింపు కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కౌలునామా పత్రం ఉంటేనే వ్యవసాయశాఖ కౌలు రైతులుగా గుర్తిస్తుంది. ధరణి పోర్టల్​లో ప్రభుత్వం అనుభవదారు కాలంను కూడా తొలగించింది. గతంలో నిర్వహించిన సమగ్ర రైతు సర్వేలో సైతం వీరిని నమోదు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.50 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. వారిలో కౌలు రైతులే ఎక్కువ మంది. కానీ వ్యవసాయశాఖ వద్ద కూడా వీరి వివరాలు లేవు. రకరకాల కారణాలు చూపుతూ వారిని గుర్తించడం లేదు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మళ్లీ సాగు చేసేందుకు సిద్ధమవుతున్న వారిపై ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. బ్యాంకు రుణాలు అందక తమ భార్యల పుస్తెలు కుదువ పెడుతున్నారు. కష్టపడి పండించిన పంట వర్షార్పణమైతే, వరదల్లో కొట్టుకుపోతే కనీసం ప్రభుత్వ నష్టపరిహారం కూడా దక్కడం లేదు. 

కౌలు ధరల్లో వ్యత్యాసం..

 భూమి రకం ఆధారంగా కౌలు ధరలు భూ యజమానులు నిర్ణయిస్తున్నారు. నీటి వసతి ఉంటే మిర్చి సాగు చేసే మెట్ట భూమి ఎకరానికి రూ.80వేలు కౌలు ధర. నీటి వసతి లేకుంటే మాత్రం రూ.50వేలు. ఎందుకంటే ఈ ఏడాది మిర్చికి రికార్డు స్థాయిలో ధర రావడంతో కౌలు రేట్లు పెరిగాయి. పెట్టుబడులు ఎక్కువై, గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలవుతున్నా కౌలు ధరల్లో మాత్రం వ్యత్యాసం ఉండదు. కౌలు డబ్బులు ఆసామికి ముందుగానే ఇవ్వాలి. పంట చేతికొచ్చాక ఇస్తామంటే కుదరదు. ముందస్తు ఒప్పందం ప్రకారం భూయజమానికి కౌలు చెల్లించాల్సి ఉంటుంది. పంటకు నష్టం జరిగితే ప్రభుత్వ పరిహారం, బీమా వంటివి సాగు చేసేవారికే చెల్లించాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. 

బ్యాంకు అప్పుకూ దూరమే..!

కౌలు రైతులందరూ ప్రైవేట్​ రుణాలపైనే ఆధారపడాలి. ప్రభుత్వ చట్టాల ప్రకారం కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలందించాలి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు రుణాలు అందించడం లేదు. రుణం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూనే భూయజమాని నుంచి లేఖ తీసుకురావాలంటూ కొర్రీలు పెడుతుంటారు. కౌలు ఒప్పంద పత్రాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉంటే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. గతంలో ఇలాంటి కార్డులు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కౌలు రైతులను అసలు గుర్తించడం లేదు. 

అందని నష్టపరిహారం...

ప్రకృతి విపత్తుల కారణంగా కలిగే పంట నష్టపరిహారం కౌలు రైతుకు దక్కడం లేదు. సాగుభూమి ఎవరి పేరు మీద ఉంటుందో వారికే అందుతోంది. నష్టం జరిగినప్పుడు విచారణకు వచ్చే అధికారులు ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగింది, ఆ పంట విలువ ఎంత? అనే వివరాలతో భూమి ఎవరి పేరు మీద ఉంటే వారి పేర్లు రాసుకుంటారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా పరిహారం నేరుగా భూ యజమాని ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలు సైతం వీరికి మేలు చేయడం లేదు. ఫలితంగా కష్టం ఒకరిది. ఫలితం మరొకరిది అవుతోంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు భూయజమానులకే పోతున్నాయి. గతంలో ఎరువులు, విత్తనాల కొరత ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వాలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చింది. వీటి ఆధారంగా ఎరువులు, విత్తనాలు, బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

భయంతో  ఇవ్వని కౌలు నామాలు

కౌలునామా పత్రం ఉంటేనే వ్యవసాయశాఖ కౌలు రైతుకు గుర్తింపు కార్డును అందిస్తుంది. దీని ద్వారా పంట రుణం, రాయితీపై విత్తనాలు పొందేందుకు అవకాశం ఉంది. ఈ పత్రం లేక వీటిని పొందలేకపోతున్నారు. సాగు భూమిని కౌలుకు తీసుకునే రైతు తప్పకుండా కౌలునామా పత్రం పొందాల్సి ఉంటుది. కానీ అలా చేస్తే తన భూమిపై హక్కులను కోల్పోతామనే భావన చాలా మంది యజమానుల్లో ఉంది. దీంతో కౌలునామాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అసలు ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించడం లేదు. మేమెందుకు ఇవ్వాలంటూ భూ యజమానులు ప్రశ్నిస్తున్నారు.

కౌలు రైతులను గుర్తించాలి...

ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించడంలేదు. రాయితీలు ఇవ్వడం లేదు. ఏటికేడు భూముల కౌలు ధరలు పెరిగిపోతున్నయ్. రాయితీలు లేక, వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేసి రైతులు నష్టపోతున్నరు. ఇది చాలా దారుణం. కౌలు రైతులను గుర్తించి, కార్డులు జారీ చేసి వారికి బ్యాంకు రుణాలు, రాయితీలు అందించాలి.
మచ్చా వెంకటేశ్వర్లు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు