మంచిర్యాల యూనిట్​ను గాలికొదిలిన ఆఫీసర్లు

మంచిర్యాల యూనిట్​ను గాలికొదిలిన ఆఫీసర్లు
  • ఇట్ల వచ్చి అట్ల వెళ్లిపోతున్న రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు
  • సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోనే నెట్టుకొస్తున్న వైనం
  • అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు

మంచిర్యాల,వెలుగు:స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంచిర్యాల యూనిట్‌‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని  ఆర్జించి పెడుతున్న యూనిట్ నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మూడున్నర సంవత్సరాల్లో ఇక్కడ రెగ్యులర్ సబ్ -రిజిస్ట్రార్ల కంటే ఎక్కువ మంది ఇన్‌‌చార్జిలే పనిచేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన యూనిట్లలో మంచిర్యాల ఒకటి. ఏటా సుమారు 15 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.40 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కానీ... 2019 జూలై 31న అప్పటి సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ రాంబాబు రిటైర్ అయిన తర్వాత యూనిట్‌‌ నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ యూనిట్లలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఇన్‌‌చార్జి సబ్‌‌ రిజిస్ట్రార్లుగా నియమించడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సరైన సేవలందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇట్ల వస్తున్నరు... అట్ల పోతున్నరు... 

2014  అక్టోబర్ 18 నుంచి 2019 జూలై 31 వరకు కె.రాంబాబు సబ్ రిజిస్ట్రార్ గా కొనసాగారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత నుంచి ఇప్పటి వరకు నలుగురు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు రాగా, ఆరుగురు ఇన్‌‌చార్జిలు పనిచేశారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్, అనారోగ్యం, వ్యక్తిగత అవసరాలు తదితర పాటు వివిధ కారణాలతో లీవ్​లు తీసుకుంటున్నారు. 2021 ఫిబ్రవరి 25న బాధ్యతలు తీసుకున్న కె.అప్పారావు అవినీతి ఆరోపణలతో నాలుగు నెలలు కూడా తిరక్కుండానే సస్పెండ్ అయ్యారు. తర్వాత హైదరాబాద్​లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న హరితకుమారిని రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్​గా నియమించారు. ఆమె సెప్టెంబర్ 13న బాధ్యతలు స్వీకరించి అదే నెల 22న తిరిగి హైదరాబాద్​కు వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఆర్.రాము పోటీ పరీక్షల కోసమని లీవ్ పెట్టారు. మధ్యలో వచ్చిన ఇమ్రాన్​ఖాన్ సైతం మూడు నెలలే పనిచేశారు. 

ఆరుగురు ఇన్​చార్జిలే... 

రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం వల్ల ఎక్కువ కాలం ఇన్​చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్లకు, అధికారులకు మంచిర్యాల ఇన్‌‌చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. రెగ్యులర్ సబ్-రిజిస్ట్రార్లు బాధ్యతగా పనిచేయడంతో రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. కానీ.. ఇన్‌‌చార్జిలకు రిజిస్ట్రేషన్లలో ఉన్న వివిధ సవాళ్లను ఎదుర్కోవడం గురించి అంతగా తెలియదు. పైగా వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఫలితంగా సరైన సేవలు అందడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేగాకుండా కొందరు ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. డాక్యుమెంట్​కు ఇంత అని రేట్ ఫిక్స్ చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అధికారుల పర్యవేక్షణ శూన్యం... 

మంచిర్యాల యూనిట్‌‌ నిర్వహణను పర్యవేక్షించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. సంబంధిత అధికారుల వార్షిక ఆడిటింగ్, తనిఖీలు తప్ప యూనిట్ లావాదేవీలు, పనితీరును చాలాకాలంగా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీంతో కొంతకాలం మాత్రమే పనిచేసే ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ర్టేషన్ల విషయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రూల్స్​ ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నట్లు సమాచారం. అదేవిధంగా వారు ఆఫీసులో విధులు నిర్వర్తించడంలో సమయాలను పాటించడం లేదు. వారు ఉదయం 11 గంటలకు రావడంతో  జనాలు గంటల కొద్ది ఎదురు చూడాల్సి వస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణను ప్రశ్నించగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దరఖాస్తుదారులకు అసౌకర్యం కలగకుండా, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ఆర్.రాము గ్రూప్-1 సర్వీసుకు ప్రిపేర్ కావడానికి సెలవులో ఉన్నారని పేర్కొన్నారు.