అమెరికాలోని ఇండియన్లను బహిష్కరించాలి: కన్జర్వేటివ్ లీడర్ చాండ్లర్ లాంగేవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు

అమెరికాలోని ఇండియన్లను బహిష్కరించాలి: కన్జర్వేటివ్ లీడర్ చాండ్లర్ లాంగేవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్‌‌‌‌ లాంగేవిన్‌‌‌‌ భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్న భారతీయులు అందరినీ వెంటనే బహిష్కరించాలంటూ ఆయన పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో  పామ్‌‌‌‌ బే సిటీ కౌన్సిల్‌‌‌‌ ఆయనపై చర్యలు తీసుకుంది. చాండ్లర్‌‌‌‌ లాంగేవిన్‌‌‌‌ ఫ్లోరిడాలోని పామ్‌‌‌‌ బే సిటీ కౌన్సిల్‌‌‌‌కు చెందిన కన్జర్వేటివ్‌‌‌‌ లీడర్. ఆయన భారతీయులను ఉద్దేశిస్తూ మూడు వారాల పాటు విద్వేషపూరిత పోస్టులు పెట్టారు. 

‘‘అమెరికాలోని భారతీయులందరిని వెంటనే బహిష్కరించాలి’’ అని తెలిపారు. ఆ తర్వాత ‘‘అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా లేరు. వారు మనల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. భారత్‌‌‌‌ ను, ఆ దేశ ప్రజలను ప్రోత్సహించేందుకే ఇక్కడ ఉన్నారు. అమెరికన్ల కోసం మాత్రమే ఈ దేశం’’ అని మరో పోస్టులో పేర్కొన్నారు. 

‘‘ఈ రోజు నా పుట్టినరోజు. ప్రతి భారతీయుడి వీసాను రద్దు చేసి వెంటనే వారిని ఇక్కడి నుంచి బహిష్కరించాలి. ఇదే నా కోరిక’’ అంటూ పెట్టిన పోస్టుకు ట్రంప్​ను ట్యాగ్‌‌‌‌ చేశారు. వీటిపై అక్కడి భారతీయ అమెరికన్ గ్రూపులతో పాటు కాంగ్రెస్‌‌‌‌ సభ్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సిటీ కౌన్సిల్‌‌‌‌ కు వరుసగా ఫిర్యాదులు అందాయి. దీంతో లాంగేవిన్​పై కౌన్సిల్ చర్యలు తీసుకుంది.