బుర్రలోని వైరస్ డిలీట్ చేసేయ్..మనసు భారం దించేయ్!

బుర్రలోని వైరస్ డిలీట్ చేసేయ్..మనసు భారం దించేయ్!

కంప్యూటరో, సెల్‌ ఫోనో సరిగా పనిచేయకుండా.. స్లో అయితే వెంటనే దానిలో ఉన్న పనికిరాని ఫైళ్లన్నీ డిలీట్‌ చేస్తాం. అలాగే, మన బుర్రలో కూడా ఒక్కోసారి చెత్తంతా పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు పనికిరాని ఫైళ్లను డిలీట్‌ చేయాలి. ఏవి పనికొచ్చేవి, ఏవి పనికిరానివి అన్న విభజన చేసుకోవాలి. ఆ తర్వాతే Ctrl+Shift+Delete బటన్‌ నొక్కాలి. అయితే ఇది అనుకున్నంత సులభం ఏమీ కాదు. బుర్రలోకి ఏఏ విషయాలు వెళ్తున్నాయో, ఏవి ఎంతకాలం ఉంటున్నాయో వెంటనే తెలుసుకోవడం కష్టం. కొన్ని కాలంతోపాటు మరుగున పడతాయి. మరికొన్ని అలాగే తిష్టవేసుకుని కూర్చొని అప్పుడప్పుడు గుర్తొచ్చి ఇబ్బంది పెడతాయి. దాంతో ఒత్తిడి, ఆందోళన.

చెక్‌ పాయింట్‌

కంప్యూటర్‌ లేదా సెల్‌ ఫోన్‌ లో అనవసరమైన ఫైళ్లు ఎక్కువైనప్పుడు పనికిరాని వాటిని, అనవసరమైన వాటిని వెతికి మరీ డిలీట్‌ చేస్తాం  మన బుర్రకు సంబంధించి కూడా అలాంటిదే అవసరం. రోజూ అనేక విషయాలు తెలిసి, తెలియకుండా లోపలకు వెళ్తుం టాయి. ఏ మూలో దాక్కుంటాయి. కానీ వాటన్నింటితో అవసరం ఉండకపోవచ్చు. టీవీలో చూసిన వార్త, రోడ్డు మీద వెళ్తూ చూసిన వ్యక్తి, ఆఫీసులో జరిగిన అనవసరమైన చర్చ.. ఇలా ఎన్నో బుర్రలోకి ఎక్కుతాయి. వాటిలో కొన్ని అవసరమైనవి, మరికొన్ని అనవసరమైనవి. అందుకే ఎప్పటికప్పుడు కంప్యూటర్‌ లోంచి  అనవసరమైన ఫైళ్లు డిలీట్‌ చేసినట్లు మనకు ఇబ్బంది పెట్టే వాటన్నిం టిని కూడా డిలీట్‌ చేయాలి. లేదంటే బుర్రలో ఉండే వెయిట్‌ మనసుపై పడి భారం పెరుగుతుంది. అయితే ఈ పని చేసేటప్పుడు ఏవి అవసరం, ఏవి అనవసరం అన్నది కరెక్టుగా చెక్‌ చేసుకుని మరీ తీసేయాలి. వారానికి ఒకసారి కుదరకపోతే నెలకు ఒకసారైనా ఎవరికి వాళ్లు ప్రశాంతంగా కూర్చొని ఈ పనిచేస్తే మనసు తేలికపడుతుంది. తిరిగి ఉత్సాహాన్ని పొందుతుంది.

పాజిటివ్‌ థింకింగ్‌

ఏ వస్తువైనా సరిగా వాడితే, ఎక్కువకాలం మన్నుతుంది. లేదంటే తక్కువ రోజులకే చెడిపోతుంది. మనసు కూడా అంతే. దాని మీద భరిం చరాని భారం వేయకూడదు. విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడప్పుడు మనసుకు నచ్చినట్లు గడపాలి. విసుగు, చికాకు అనిపిస్తే చేస్తున్న పని నుంచి వెంటనే ఉపశమనం ఇవ్వాలి. ఏదైనా జరగరానిది జరిగినా, అనుకున్నది సాధించలేకపోయినా.. మనసు తట్టుకోలేదు. అలాంటి ఫీలింగ్‌ నుంచి వెంటనే బయటపడాలి. అందుకు పాజిటివ్‌ థింకింగ్‌ అవసరం. ఎప్పటికప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలి. ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోనుకాకూడదు. కంప్యూటర్‌ ను ఎంత భద్రంగా వాడితే అంత ఎక్కువరోజులు బాగా పనిచేస్తుంది. లేదంటే చెడిపోతుంది. టెక్నిషీయన్‌ దగ్గరకు పట్టుకెళ్లాలి. మనసు కూడా అంతే.. మంచి ఆలోచనలతో సరిగా జీవితాన్ని గడపకపోతే సైకాలజిస్టు దగ్గరకు వెళ్లాల్సి రావచ్చు. కౌన్సెలింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు.

ఉద్వేగాలు

సెల్‌ , కంప్యూటర్‌ దేనికైనా చార్జింగ్‌ ముఖ్యం. చార్జింగ్ అయిపోతే పనిచేయవు. మరో మార్గం లేదు. చార్జింగ్‌ పెట్టాల్సిం దే. మనసు కూడా అంతే.. ఒక్కోసా రి పూర్తిగా మొరాయిస్తుంది. అందుకు కారణం ఎక్కువగా ఉద్వేగాలకు లోనవడమే. కోపం, భయం, బాధ.. లాంటి చెడు ఉద్వేగాలు ఎక్కువైతే చిరాకొస్తుంది. ఉద్వేగాలు ఎక్కువైనప్పుడు ప్రదర్శించడం కంటే ఆ స్థలం నుంచి లేదా ఆ వ్యక్తుల నుంచి దూరంగా వెళ్లిపోవడమే మంచిది. ఇవి కంప్యూటర్‌ లో వైరస్‌ లాంటివి. వైరస్‌ లను క్లీన్‌ చేస్తే సిస్టమ్‌ మళ్లీ మామూలుగా పనిచేస్తుంది. అలాగే ఉద్వేగాలను అణచిపెట్టే కంటే సమయం, సందర్భం వచ్చినప్పుడు బయపడేస్తే మనసు  లికపడుతుంది.అలా కాకుండా లోపలే పెట్టుకుంటే మనసు భరించలేదు. వేరే రూపంలో బయటకొస్తా యి. ఉద్వేగాలను ప్రదర్శించేం దుకు వేచి చూడాలి. ఓపికగా ఉండాలి. అందువల్లే మనసుపై తీవ్ర ప్రభావం చూపే ఎమోషన్స్‌‌ను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ పోవాలి అంటారు నిపుణులు.

బంధాల బ్యాలెన్స్

కంప్యూటర్‌ లో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సెల్‌ ఫోన్‌ లోనూ అంతే. కొన్ని భాగాలు పనిచేయకపోయినా అవి బాగానే పనిచేస్తాయి. కానీ ముఖ్యమైన భాగాలు చెడిపోతే షట్‌ డౌన్‌ అవుతాయి. మనసు కూడా అంతే.. కొన్ని బంధాలు దూరమైతే పెద్దగా ఫీలవదు. అదే మనసుకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తులు దూరమైతే తట్టుకోలేదు. అందువల్ల మనసు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రిలేషన్స్‌‌ను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్‌‌ చేసుకుంటూ పోవాలి. లేదంటే ఇబ్బందిపడక తప్పదు.

మనసు ముఖ్యం

సంతోషంగా బతకాలంటే మనసు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, ఎన్ని బంధాలు దూరమైనా, అవరోధాలు వచ్చినా మనసును మాత్రం భద్రంగా చూసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే, మనసు చాలా సున్నితమైంది. మనసుకు ఏది ఇస్తే అదే తిరిగి మనకు ఇస్తుంది. బతుకును కష్టాలమయం చేసుకుంటే మనసు బాధను తిరిగి ఇస్తుంది. అనుబంధాలు, ఆప్యాయతలు ఇస్తే సంతోషం, ఆహ్లాదం ఇస్తుంది. అందుకే మనసనే హార్డ్‌‌డిస్క్‌‌ను ఎప్పుడూ ఆనందంగా కాపాడుకోవాలి.