7.29 శాతం పెరిగిన ఎగుమతులు.. వాణిజ్య లోటు 8 నెలల గరిష్టానికి

7.29 శాతం పెరిగిన ఎగుమతులు.. వాణిజ్య లోటు 8 నెలల గరిష్టానికి
  • గత నెల వీటి విలువ 37.24 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: రెండు నెలల తగ్గుదల తరువాత, భారతదేశ ఎగుమతులు జులైలో 7.29 శాతం పెరిగి  37.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే నెలలో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్టమైన  27.35 బిలియన్ డాలర్లకు విస్తరించింది. గురువారం విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, ఈ ఏడాది జులైలో దిగుమతులు సంవత్సరానికి 8.6 శాతం పెరిగి  64.59 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు జులైలో  27.35 బిలియన్ డాలర్లకు విస్తరించింది. 

ఇది గత సంవత్సరం నవంబర్​లో వాణిజ్య లోటు  31.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాక ఇదే అత్యధికం. 2025-–26 ఏప్రిల్–-జులై  కాలంలో  ఎగుమతులు 3.07 శాతం పెరిగి  149.2 బిలియన్ డాలర్లకు,  దిగుమతులు 5.36 శాతం పెరిగి  244.01 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2025–-26 మొదటి నాలుగు నెలల్లో వాణిజ్య లోటు  94.81 బిలియన్ డాలర్లుగా ఉంది. 

ఈ విషయమై కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారతదేశ వస్తువుల, సేవల ఎగుమతులు బాగా రాణిస్తున్నాయని చెప్పారు. ప్రపంచ ఎగుమతుల వృద్ధి కంటే భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని  చెప్పారు. ఈ వృద్ధికి ప్రధానంగా ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాలు ఇంకా ఆభరణాలు, ఫార్మా, రసాయనాలు లాంటి రంగాలు కారణమని  ఆయన వివరించారు.