
- విమెన్ ఇన్ పోలీస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: పోలీస్ నియామకాల టైమ్‌లో లేని లింగ వివక్ష.. విధుల్లో చూపడం సరైంది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళా పోలీసులు అనే పదాన్ని తొలగించాలన్న పోలీసుల సిఫార్సు.. మంచి ఆలోచన అని తెలిపారు. మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
మహిళా పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారాలపై ప్రత్యేకంగా కమిటీ వేసి.. ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ‘విమెన్ ఇన్ పోలీస్’ పేరుతో 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా పోలీసుల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
‘‘సదస్సులో భాగంగా చర్చకు వచ్చిన సమస్యలపై పోలీస్‌శాఖ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను ఏకీభవిస్తున్నాను. ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అవసరాలు తీర్చడమే మా ప్రభుత్వ ఎజెండా. వ్యక్తిగత సమస్యలతో పాటు శాఖాపరమైన అవసరాలు, సమస్యలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టండి’’అని భట్టి అన్నారు.
పోలీస్ సిబ్బంది పిల్లల చదువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భట్టి అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలు చదువుకునేందుకు హైదరాబాద్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.