జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా .. తమ పిల్లలు ఎలా చనిపోయారో చెప్పాలని.. తమకు ఏదైనా ఆధారం చూపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. అబద్ధాలు చెప్పే ఉపాధ్యాయులు తమకు వద్దని పిల్లల తల్లిదండ్రులు భట్టికి చెప్పారు. కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా చీమ కుడితే పిల్లలు పడిపోతారా అంటూ మండిపడ్డారు. గురుకులంలో సీటు వచ్చిన ఆనందం కంటే భయం ఎక్కువ ఉందని భట్టితో చెప్పారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు భట్టి విక్రమార్క.
ఇద్దరు విద్యార్థుల మృతి .. నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ .గురుకుల పాఠశాలలో ఉన్న వసతులు, ఉన్న సిబ్బంది, డ్యూటీ నర్స్ సంబంధించిన వివరాలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం భట్టి.
