
ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాజ్యాంగమే లేకపోతే దేశంలో పేదలు, సామాన్యులు, గిరిజనులు, దళితులకు, బలహీన వర్గాలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అద్భుత గ్రంథం రాజ్యాంగం అన్నారు. రాష్ట్రంలో రూ.21,832 కోట్లతో 69 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. పేద గిరిజనుల భూములన్నిటిని సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస పథకం కింద రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
కార్యకర్త నుంచి పార్టీ చీఫ్గా ఖర్గే: మహేశ్ గౌడ్
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దేశ రాజకీయాల్లో చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన పోరాటానికి ప్రతీక అని అభివర్ణించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అత్యున్నత పదవి చేపట్టారన్నారు. సెక్యులరిజం, సామాజిక న్యాయం, సామరస్యానికి ఖర్గే ప్రతీకగా నిలిచారని చెప్పారు. ఖర్గే ఎప్పుడు కూడా ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారన్నారు. రైల్వే, కార్మిక, సామాజిక న్యాయం వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా గ్రామ స్థాయి అధ్యక్షులు మొదలుకొని రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేయడానికి ఖర్గే వచ్చారన్నారు.