ఫోన్​ ట్యాపింగ్​ కన్నా ద్రోహం ఏముంది? : డిప్యూటీ సీఎం భట్టి

ఫోన్​ ట్యాపింగ్​ కన్నా ద్రోహం ఏముంది? : డిప్యూటీ సీఎం భట్టి
  • దేశ భద్రతకే బీఆర్​ఎస్​ ముప్పు తెచ్చింది: డిప్యూటీ సీఎం భట్టి
  • పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు?
  • అన్ని తప్పులు చేసి సంబంధం లేదంటారా?
  • బీఆర్​ఎస్​ నేతలను ఏ ఒక్కరూ క్షమించరు
  • గత సర్కార్​ తప్పిదాల వల్లే నీటి కష్టాలని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: పాలించాలని ప్రజలు బాధ్యతలు అప్పగిస్తే వాళ్ల భద్రతకే ముప్పు తెచ్చిపెట్టేలా గత బీఆర్​ఎస్​ సర్కార్​ ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడిందని, ఇంతకంటే ద్రోహం ఏముంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫోన్​ ట్యాపింగ్​తో దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి, దానితో సంబంధం లేదని అంటారా? ని నిలదీశారు. బీఆర్​ఎస్​ నేతలను ఎవరూ క్షమించరని ఆయన హెచ్చరించారు. 

తుక్కుగూడ సభ ఏర్పాట్లను గురువారం భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫోన్ ట్యాపింగ్‌‌తో తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పదేండ్లు పాలన చేసింది మీరు. దానికి మీరే కదా బాధ్యులు. దేశ భద్రత, టెర్రరిస్టులను పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను.. సామాన్యులు, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి వాడుతారా? దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాన్ని రాజకీయ అవసరాల కోసం ఫణంగా పెట్టారు. తద్వారా దేశ భద్రతకు ప్రమాదాన్ని తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌‌ను అడ్డం పెట్టుకొని పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడానికి హక్కు ఎవరిచ్చారు? ” అని మండిపడ్డారు. ఈ దేశంలో పౌరులకు స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా జీవించే హక్కు ఉందని, కానీ వాళ్ల స్వేచ్ఛను గత బీఆర్ఎస్​ సర్కార్​ హరించిందని అన్నారు.

 ‘‘భార్యభర్తలు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు, అధికారులు, జడ్జిలు ఏ మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ల బెడ్రూమ్‌‌లోకి ఫోన్ ట్యాపింగ్ రూపంలో దూరారు. ఇన్ని చేసి మాకేం సంబంధం అంటారా? దుర్మార్గంగా ఇతరుల జీవితాల్లోకి, సంసారాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించరు. ఫోన్​ ట్యాపింగ్​ చర్య పౌరుల భద్రతకే పెను ప్రమాదం. ఫోన్లు  ట్యాపింగ్ చేసి.. వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరెవరికి ఇచ్చారు..? ఏం చేశారు..?! తమ ఫోన్లు ట్యాప్​ చేసి డబ్బులు వసూలు చేశారని కొందరు బహిరంగంగా చెప్పారు” అని ఆయన తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం. ఈ రాష్ట్రం మనందరిది. మనకోసం కొట్లాడి తెచ్చుకున్నాం. స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా ప్రతి పౌరుడు బతికే హక్కును సంపూర్ణంగా కల్పిస్తాం. ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్‌‌ వ్యవహారంలో ఊరుకునేది లేదు. ఇప్పటి వరకు జరిగిన నష్టంపై చర్యలు తీసుకుంటాం. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో ఈ అంశంపై చెప్తాం” అని పేర్కొన్నారు.  

బీఆర్​ఎస్​ తీరు వల్లే డిస్కమ్​లు,జెన్కోలు కుప్పకూలినయ్​

కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు నీళ్లకు తెలంగాణ ఇబ్బంది పడాల్సి వస్తున్నదని భట్టి విక్రమార్క అన్నారు. వర్షాకాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, వానలు పడ్డప్పుడు ఆ ప్రభుత్వం నీళ్లను కాపాడుకుంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదని తెలిపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్పకు పోయి నాగార్జునసాగర్ గేట్లను ఎత్తి నీళ్లను బయటకు పంపావు. కాళేశ్వరం కుంగిపోవడంతో అందులోని గోదావరి జలాలను బయటకు వదిలావు. కృష్ణా, గోదావరి రెండు నదుల నీళ్లను ఖాళీ చేసింది మీరే కదా” అని కేసీఆర్​ను నిలదీశారు. అన్ని తప్పులు చేసి ఇప్పుడేమో కాంగ్రెస్ తోనే కరువొచ్చిందంటూ మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. 

అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా కూడా పనికిరాదన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌‌కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌‌ను బొగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతున్నదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల డిస్కమ్ లు, జెన్కోలు కుప్పకూలిపోయాయని తెలిపారు. కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నామన్నారు. 2030–-31 వరకు పిక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 

సభ ద్వారా కాంగ్రెస్​ తడాఖా చూపుదాం

‘‘తుక్కుగూడ జన గర్జన సభ.. ఈ దేశానికి దిశా నిర్దేశం చేయబోతున్నది. సభ ద్వారా కదం తొక్కుదాం.. కాంగ్రెస్ తడాఖా చూపుదాం” అని కాంగ్రెస్​ కేడర్​కు భట్టి విక్రమార్క సూచించారు. లోక్‌‌సభ ఎన్నికల వేళఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుందని చెప్పారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము హామీలను ఇచ్చి వదిలిపెట్టలేదని, బీఆర్ఎస్ ఊహకు కూడా అందకుండా 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేపట్టిందని ఆయన అన్నారు.  

రాబోయే ఐదేండ్లలో  డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించామని తెలిపారు. అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో నమోదు చేశామని తెలిపారు. రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నామన్నారు. 

ముసీ నదిని పునర్జీవం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన తెలిపారు.  హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టామని, బీఆర్ఎస్ సర్కారు ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే ఆ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే తమ సర్కారు లక్ష్యమని తెలిపారు. 

కరువుకు కేసీఆర్​ పాలనే కారణం

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులకు మాజీ సీఎం అస్తవ్యస్త పాలనే కారణమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టులోని నీళ్లను సద్వినియోగం చేసుకోకుండా గత బీఆర్ఎస్​ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆనాలోచిత నిర్ణయాల వల్ల రిజర్వాయర్లన్నీ ఎండిపోయాయన్నారు. అయినా ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా మేం చర్యలు తీసుకుంటున్నమని చెప్పారు. రెండు, మూడ్రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై క్లారిటీ వస్తుందని అన్నారు. గురువారం ఖమ్మంలోని డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక ట్రిపుల్​ఆర్, తాడిచర్ల2 మైన్, ఎలివేటెడ్ కారిడార్ అంశాల్లో కేంద్రం నుంచి క్లియరెన్స్​లు తెచ్చామని భట్టి అన్నారు. 

గత బీఆర్ఎస్​ప్రభుత్వం యాదాద్రి థర్మల్​ప్లాంటుకు ఎన్విరాన్​మెంటల్ క్లియరెన్స్ తీసుకోకపోవడంతో నిర్మాణం లేటు కావడంతోపాటు రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని భట్టి ఆరోపించారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి, మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో మూడు నెలల్లో రాష్ట్రంలో 30వేల ఉద్యోగాలు కల్పించామని. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే  దేశంలో ఇటువంటి పరిపాలన సాధ్యమన్నారు.  తుక్కుగూడ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.