
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లిస్తాం
- బిల్లులపై ఆందోళన వద్దు.. ప్రతీ వారం డబ్బులు చెల్లిస్తాం
- తాండూరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం వెల్లడి
హైదరాబాద్/వికారాబాద్, వెలుగు: బీసీలకు కేంద్రం అన్యాయం చేయొద్దని, 42 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు రాహుల్ ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ తీర్మానం ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించామని చెప్పారు.
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. ‘‘ప్రతి కుటుంబం సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేర్ల మార్పులు, చేర్పులను స్పీడప్ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 95 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఫ్రీగా అందిస్తున్నాం. రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం’’అని భట్టి అన్నారు.
ఇందిరమ్మ బిల్లులు ఆగవు
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రతి వారం బిల్లులు చెల్లిస్తామని భట్టి హామీ ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వం ఇంటి నిర్మాణాలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం. అర్హులైన వారందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. విద్యా వ్యవస్థను మెరుగుపరిచాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ పాఠశాలల్లో సౌలత్లు కల్పించాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 104 నియోజకవర్గాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ స్కూళ్లు.. విద్యా రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయి. ఈ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తున్నామని భట్టి అన్నారు. ‘‘రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. గత బీర్ఎస్ సర్కార్.. పదేండ్లలో ఒక్కసారి కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. కాగ్నా నది నీళ్లు వృథా కాకుండా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలన్న స్థానికుల విజ్ఞప్తిని పరిశీలిస్తాం’’అని భట్టి అన్నారు. చిలకలవాగుతో తాండూరు పట్టణం ముంపునకు గురవుతున్న సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.