
జగిత్యాల జిల్లా పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ గురుకుల పాఠశాలను పరిశీలించిన భట్టి, మంత్రి పొన్నం.. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. విద్యార్థుల పేరెంట్స్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి. చిన్నారుల మృతి బాధాకరమన్నారు. వారి తల్లిదండ్రులను ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన పిల్లల కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు భట్టి. ఇంకా భవిష్యత్తు ఉన్న ఇద్దరు బిడ్డలు చనిపోవడం బాధాకరం. ఆ తల్లిదండ్రుల బాధను తాము అర్థం చేసుకుంటున్నామన్నారు భట్టి.
గత కొన్నేళ్లుగా పాఠశాలల పట్ల చూపిన నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమన్నారు భట్టి. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మిగిలిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కావలసిన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ పాఠశాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని పాఠశాలలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు భట్టి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 5000 కోట్లు పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించామన్నారు. విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రతి హాస్టల్లో పారామెడికల్ స్టాప్ ఉండేలా చూస్తాం.. విద్యార్థుల ఆరోగ్యం కోసం శ్రద్ధ వహిస్తామన్నారు. అత్యవసర మందులు కూడా పాఠశాల హాస్టల్ లో ఉండేలా చూస్తామన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచుతామన్నారు భట్టి. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఆహారంతో పాటు విద్యార్థులకు మౌలిక వసతులు, బెడ్ షీట్లు అందించాలని ఆదేశించారు. పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో ఔషధ మొక్కలు, పళ్ళ మొక్కలు పెంచుతామన్నారు. పాఠశాలలో ఏయే వసతులు కావాలో చెక్ లిస్టు తయారు చేయాలన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకు ఒక సారైనా విద్యార్థుల హాస్టళ్లను సందర్శించి వారితో కలిసి భోజనం చేయాలన్నారు భట్టి.