
- బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసింది
- చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చినం
- వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని వెల్లడి
- ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్ష
- హాజరైన మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల
ఖమ్మం, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకొని నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, సీజనల్ వ్యాధులు, వానాకాలం సాగు ప్రణాళిక తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూంఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసిందని భట్టి విమర్శించారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలోకి విసిరేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. వడ్లు అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. సన్న రకం వడ్లు అమ్మిన రైతులకు అదనంగా బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
అసైన్డ్ భూములకు జూన్2న పట్టాలు: పొంగులేటి
అసైన్డ్ భూములలో పొజిషన్ లో ఉన్న నిరుపేదలకు జూన్ 2న పట్టాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎక్కడైనా తహసీల్దార్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ భూములకు కూడా కొందరు సాదాబైనామా దరఖాస్తులు చేసుకున్నారని, వాటిని వెంటనే తిరస్కరించాలని ఆదేశించారు. హైకోర్టు స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదాబైనామాలను పరిష్కరిస్తామన్నారు.
జూన్ 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. ఒత్తిడులకు లోనై అనర్హులకు ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా అందించాలన్నారు. అర్ధాంతరంగా మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తి చేయాలని సూచించారు. అడవుల్లో కొత్తగా పోడు కోసం ఒక్క చెట్టు కొట్టడానికి వీళ్లేదని.. కానీ, 30, 40 ఏండ్ల నుంచి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులను ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించారు.
ఎరువులు అందుబాటులో ఉంచాలి: కోమటిరెడ్డి
ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు బాగా జరుగుతున్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. రుతుపవనాలు ముందుగా వచ్చిన నేపథ్యంలో వానాకాలం పంట సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణానికి రూ.200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జిల్లాల్లో కలెక్టర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.
స్టాక్ వివరాలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కూనంనేని సాంబశివరావు, కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మీల్‌ఖాన్, జితేశ్వి. పాటిల్, సీపీ సునీల్ దత్, ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు పాల్గొన్నారు.