
- చిన్నచిన్న కారణాలతో పెండింగ్‌లో పెట్టొద్దు: భట్టి
- టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో మాఫీకాని వారికి వెంటనే జమ చేయండి
- రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవు
- బ్యాంకులకు రుణమాఫీ కింద 18 వేల కోట్లిచ్చినం
- ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్లోన్లు రూ.17,300 కోట్లు దాటలే
- రుణమాఫీ తర్వాత రైతులకిచ్చింది 7,500 కోట్లే
- ఆలస్యం చేయకుండా అంతకు మించి లోన్లు ఇవ్వండి
- స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై అలసత్వం వహించొద్దని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ చేయకుండా పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. టెక్నికల్ప్రాబ్లమ్స్తో రుణమాఫీ కానివారికి వెంటనే వారి లోన్ అకౌంట్లలో డబ్బులు జమచేయాలని అన్నారు. రైతులనుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా భవన్లో మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ కింద ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చామని, కానీ రైతులకు మాత్రం బ్యాంకులు ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు రూ.17,300 కోట్లు మాత్రమే ఇచ్చాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత రైతులకు రూ.7,500 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ లాగే క్రాప్ లోన్లు కూడా వెంటనే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంకా రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడంలో ఆలస్యం తగదని అన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. రుణమాఫీ త్వరగా పూర్తయి, క్రాప్‌లోన్ల పంపిణీ ఆలస్యమైతే ఫలితం ఉండబోదని చెప్పారు.
రుణమాఫీ మొత్తానికి డబుల్స్థాయిలో పంట రుణాలు ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా తాము భావిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయని తెలిపారు.
పారిశ్రామిక రంగానికి కూడా ప్రయారిటీ
వ్యవసాయంతోపాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి, రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇవ్వనున్నట్టు తెలిపారు. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయాలని అన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నట్టు చెప్పారు. మొదటి క్వార్టర్ లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని, ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల ఎఫ్‌సీఐకి వరిని సరఫరా చేసే రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
కష్టకాలంలోనూ రుణమాఫీకి నిధులు: తుమ్మల
విస్తృతంగా వర్షాలు పడుతుండడంతో ఈ వానాకాలంలో కూడా అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని ఆశిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కష్టకాలంలో కూడా రైతు రుణమాఫీకి ప్రభుత్వం రూ.18వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. కిందిస్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణఖాతాలో తప్పులు సరిదిద్దేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంకెలు చదువుకొని 3 నెలలకోసారి మీటింగ్ లు పెట్టడం వల్ల బ్యాంకర్ల సదస్సు నిర్వహణకు అర్థం లేదని అన్నారు. రైతులకు, పేదలకు, లక్షిత వర్గాలకు ఆర్థిక ఫలాలు చేరేలా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, బ్యాంకర్లు పాల్గొన్నారు.