- తొలి ప్రధానిగా నెహ్రూ లేకపోతే
- దేశ పరిస్థితిని ఊహించుకోలేం
- విజ్ఞానదర్శిని సమావేశంలో
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బషీర్‌బాగ్, వెలుగు: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్ మెంట్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైజ్ఞానిక అభివృద్ధికి ప్రయోగశాలగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర కేబినెట్ సభ్యులంతా విద్యావంతులని..
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా యావత్ కేబినెట్ కృషి చేస్తుందన్నారు. సెంటిఫిక్గా విజన్‌తో సమాజాన్ని ముందుకు నడిపించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టకపోయి ఉంటే భారతదేశంలో నేటి పరిస్థితిని ఊహించుకోలేకపోయే వాళ్లమన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధాని కావడంతో సైన్స్ లోనే కాకుండా , ప్రజాస్వామ్యంలోనూ ప్రపంచంతో పోటీ పడేలా ఎదిగామన్నారు.
స్వాతంత్రం సాధించిన సమయంలో ఆహారం, విద్యా రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, ఆనాడు ఇండియా ఎదుర్కొన్న సవాళ్లను నాటి ప్రధాని నెహ్రూ విజన్‌తో సైంటిఫిక్ టెంపర్మెంట్ తో పునాదులు వేయకపోతే నేడు దేశ ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు రూపొందించి అందులో ఏ అంశంపై దృష్టి పెట్టాలి అనేది మేధావులతో చర్చించి ఖరారు చేశారని తెలిపారు. మిశ్రమ ఆర్థిక విధానాలు రూపొందించారని.. దేశంలో సోషలిజం ఆలోచనను విస్తృతం చేశారని వివరించారు.
