చేవెళ్ల, వెలుగు : రాష్ట్రంలో ఉన్న అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి మొయినాబాద్ మండలం నజీబ్‌నగర్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టూడెంట్లకు బుక్స్, బెడ్‌షీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్అని, ప్రజా ప్రభుత్వం విద్యను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని, రాష్ట్రంలోని 29 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 220 శాతం పెంచామని, ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య పాటు మెరుగైన వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి రాష్ట్ర సంపదగా మారాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పేద విద్యార్థుల కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. నజీబ్ నగర్ హాస్టల్లో వేడి నీళ్ల కోసం హీటర్‌తో పాటు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సుల సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ మంత్రిని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, నాయకులు పామెన భీంభరత్, కేఎల్‌ఆర్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ పాల్గొన్నారు.
