
- అప్పుడే స్కీమ్‌ను పక్కాగా అమలు చేయొచ్చు: భట్టి
- అగ్రికల్చర్, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖలపై డిప్యూటీ సీఎం సమీక్ష
- హాజరైన మంత్రి తుమ్మల, అధికారులు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏ విధంగా ముందుకుపోతే బాగుంటదో రైతుల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు. అప్పుడే రైతు భరోసాను పక్కాగా అమలు చేయొచ్చని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారి ఒపీనియన్లు తీసుకోవాలని, అందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని చెప్పారు.
మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత సక్సెస్ అవుతుందని అన్నారు. అగ్రికల్చర్, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖలతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిన అగ్రికల్చర్ స్కీమ్‌లు, వాటికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, రాబోయే సీజన్‌కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి. అగ్రికల్చర్ సెక్టార్ అభివృద్ధి చెందితే ఉత్పత్తులు పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’’అని భట్టి అన్నారు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు, వాటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాబోయే బడ్జెట్‌పై సమీక్ష
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ఇప్పటిదాకా చేసిన ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్ పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. డ్రిప్ ఇరిగేషన్ కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.
ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రయోజనాల గురించి అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు సూచించారు.
రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్
రామగుండంలో 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ పవర్ప్లాంట్నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మకమైన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ను తిరిగి నిర్మిస్తామని తెలిపారు. మంగళవారం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్సింగ్రాజ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు తదితరులు డిప్యూటీ సీఎంను కలిశారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని కోరారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని పూర్తి చేయాలని సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కోరగా.. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్నికల హామీని పూర్తి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పిట్ హెడ్ ప్లాంటును సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.