సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తం: భట్టి

సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తం: భట్టి
  •    బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకానికి ఆదేశాలు
  •     సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్, రామగుండంలో
  •     థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై పరిశీలిస్తున్నట్లు వెల్లడి
  •     హైదరాబాద్‌లో సింగరేణి గెస్ట్​హౌస్​కు శంకుస్థాపన

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణిలో ఈ ఏడాదిలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం సిగరేణిని నిర్లక్ష్యం చేసిందని, సంస్థను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిర్మించనున్న సింగరేణి గెస్ట్‌ హౌస్ కు మంగళవారం భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని.. సింగరేణి సంపదను పెంచడం.. పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని చెప్పారు.

గత వారం సింగరేణిలో 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. మరో 1352 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ల తరహాలో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా డాక్టర్ బీఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

సింగరేణిని విస్తరిస్తం..

సింగరేణి ప్రాంతానికి చెందిన తనకు ఈ గెస్ట్‌ హౌస్ ప్రారంభించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణికి హైదరాబాద్​లో గెస్ట్ హౌస్ లేకపోవడం బాధాకరమని.. కార్మికులు, సంస్థ ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. సింగరేణి చర్యల్లో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే రామగుండంలో జెన్ కో ఆధ్వర్యంలో నిర్మించిన థర్మల్‌ ప్లాంట్ స్థానంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. సింగరేణికే ఈ ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే సింగరేణి సుస్థిర భవిష్యత్ కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి తాడిచర్ల -2 గనిని సింగరేణికి  కేటాయించాలని విజ్ఞప్తి చేయగా, సానుకూల స్పందించారని వివరించారు.

అదే విధంగా నైనీ గని ప్రారంభానికి ఉన్న అవాంతరాలను తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు. పట్టాలను రెగ్యూలరైజ్‌ చేస్తామని చెప్పారు. సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థను దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకట స్వామి,  వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,  ప్రేమ్ సాగర్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఐఎన్‌టీసీ నేతలు జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.