
- బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేస్తామని వెల్లడి
- డిప్యూటీ సీఎంతో బీసీ సంఘాల నేతల భేటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తున్నదని.. ఇందులో ఎవరికీ సందేహాలు లేవని స్పష్టం చేశారు. గురువారం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎంను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు కుందారం గణేష్ చారి, శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కలిశారు. ఈ సందర్భంగా బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో భట్టి విక్రమార్క చర్చించారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోని బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్ ప్లాన్ తీసుకురావాలని డిప్యూటీ సీఎంను కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, పూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచడంతోపాటు రాష్ట్ర బడ్జెట్లో నిధులు పెంచి బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నామన్నారు.