
ఖమ్మం/ మధిర/ భూపాలపల్లి / ఏటూరునాగారం, వెలుగు: ఏపీ సర్కారు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి ఎగువ భాగంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, వరద జలాల్లో మన హక్కు తేలాకే దిగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని అన్నారు. బనకచర్లను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు కేంద్రంతో, మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారని తెలిపారు.
వారిద్దరూ నిటారుగా నిలబడడంతోనే బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ.630.30 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం (సమక్క సాగర్) ప్రాజెక్ట్‌ను, గంగారం వద్ద దేవాదుల ఇంటెక్ వెల్ పంప్ హౌస్‌ను పరిశీలించారు.
ఇక్కడ మంత్రి సీతక్క వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీటిని తరలిస్తున్న పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌ను వెంటనే నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. రోజుకు 11 టీఎంసీలు తరలించుకుపోతే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు కేవలం 25 రోజుల్లోనే ఖాళీ అవుతుందన్నారు.
భద్రాచలం డివిజన్‌లోని 7 మండలాలను విభజన చట్టంలోనుంచి మినహాయించాలని కోరగా సోనియాగాంధీ ఒప్పుకున్నారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ .. బీఆర్ఎస్‌తో కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిందని మండిపడ్డారు. దీంతో గిరిజనులకు చెందిన 2 లక్షల ఎకరాలు పోలవరం కింద మునిగిపోతున్నాయని అన్నారు. గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా పోలవరం ఎత్తు తగ్గించాలని చంద్రబాబును కోరారు.
చివరి ఆయకట్టుకూ నీరందాలి: మంత్రి ఉత్తమ్
నాగార్జున సాగర్ చివరి ఆయకట్టుకూ సాగునీరు అందేలా పోరాటాలు కొనసాగించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జలవనరుల శాఖ నుంచి కోర్టు వరకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రాయలసీమ ప్రాజెక్టులు, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, గోదావరి నది బోర్డు నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని చోట్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలిపారు.
‘‘బనక చర్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్‌ను రూ.38 వేల కోట్లతో నిర్మించి తీరుతం. భూపాలపల్లి జిల్లాలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టును సైతం పరిగణనలోకి తీసుకొని ఇరిగేషన్ అభివృద్ధి పనులు చేపడ్తం” అని వెల్లడించారు. గత పాలకుల అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినట్టు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొన్నదని చెప్పారు. జవహర్ ఎత్తిపోతల పథకం పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నది జలాలు తీసుకొస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పుకు రాబోయే రెండేండ్లలో అసలు, వడ్డీ కలిపి లక్ష కోట్లు కట్టాల్సి వస్తున్నదని రాష్ట్ర ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తే.. ఇందులో రూ.16 వేల కోట్లు కాళేశ్వరం కింద చేసిన అప్పులకే కట్టాల్సి వస్తున్నదని చెప్పారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయమై చత్తీస్‌గఢ్ సాగునీటి పారుదల శాఖ మంత్రి కశ్యప్ తో చర్చలు జరుపుతున్నామని, ఆ రాష్ట్ర పరిధిలోని ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించడంపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
దేవాదుల.. అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు
రాష్ట్ర ప్రభుత్వానికి జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ అత్యంత ప్రాధానత్య కలిగినదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగునీళ్లు అందుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు భూసేకరణకు, వర్క్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడతలవారీగా చెల్లిస్తామని తెలిపారు.
5 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తే.. ఈ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం 6 లక్షలకు ఆయకట్టు పెరిగిందని, ప్రతీ యేటా ఆయకట్టు రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లకు సాగునీరు అందిస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. పెండింగ్ బిల్లులు రూ.వంద కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.