
- జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో భాగంగా 12శాతం స్లాబ్‌ను తొలగించడంతో పాటు కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఇతర వస్తువులు, సేవలపై పన్ను రేట్లను పెంచే అంశం, ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాలన్నారు.
దీనిద్వారా వినియోగదారులకు లాభం చేరేలా చూసి, రాష్ట్ర ఆదాయాలపై దీని ప్రభావం, దానికోసం ఉండే పరిహార వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే రేటు రేషనలైజేషన్ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రుల సమూహం (జీఓఎం) ఏర్పాటు చేయడం జరిగిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రతిపాదనల రేటు రేషనలైజేషన్‌పై ఉన్న ఆ మంత్రులకు (జీఓఎం) పంపించడం సముచితమైన విషయంగా భావిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేస్తే, కౌన్సిల్ తగిన నిర్ణయం తీసుకోగలదన్నారు.
సుదర్శన్ రెడ్డికి డిప్యూటీ సీఎం అభినందనలు..
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.