మహారాష్ట్ర గవర్నర్  కోష్యారీ కామెంట్స్ ను  సమర్థించను

మహారాష్ట్ర గవర్నర్  కోష్యారీ కామెంట్స్ ను  సమర్థించను

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. గవర్నర్ కోష్యారీ ప్రకటనతో తాను ఏకీభవించనని చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధికి మరాఠీ ప్రజలు సహకరించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా భాగస్వాములయ్యారని, ఈ విషయంలో మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించలేమని  ఫడ్నవిస్ అన్నారు. 

‘‘గుజరాతీలు, రాజస్థానీలను  మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబయి, థానే నుంచి పంపిస్తే ఇక్కడ సంపద అనేది ఉండదు. అప్పుడు దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి కొనసాగడం కష్టం’’ అని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కామెంట్స్ చేశారు. ముంబయిలోని అంధేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన సహా పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ కోష్యారీపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి వ్యాఖ్యల ద్వారా గవర్నర్ మరాఠీలను అవమానించారని చెప్పారు.  హిందువులను విభజించేలా కోష్యారీ కామెంట్స్ ఉన్నాయన్నారు. వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోష్యారీని ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు.

మహారాష్ట్ర, మరాఠీలను గవర్నర్ అవమానిస్తున్నారంటూఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలన్నారు. 

స్పందించిన సీఎం  ఏక్ నాథ్ 
గవర్నర్ వ్యాఖ్యలను తాము సమర్థించబోమని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. రాజ్యాంగంలోని  నీతి సూత్రాలకు  గవర్నర్  కట్టుబడి మాట్లాడాలన్నారు. మరాఠీ  ప్రజల సహకారాన్ని  ముంబై  ఎప్పటికీ  మర్చిపోలేదని చెప్పారు. 

ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కామెంట్స్ : సుప్రియా
గవర్నర్  భగత్ సింగ్ కోష్యారీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారని  ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ కోష్యారీని గవర్నర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరుతామని వెల్లడించారు.