- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
మధిర/ముదిగొండ/ఎర్రుపాలెం, వెలుగు : వరదలకు కారణమైన అడ్డగోలు నిర్మాణాలు వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. మధిర, ముదిగొండ, ఎర్రుపాలెంలో బాధితులను కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. చింతకాని మండలం మతికేపల్లి తిరుమలాపురం మధ్య రోడ్డు, మతికేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. నామవరం బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగుని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
పరికరాలకు సంబంధించి రిపోర్ట్ పంపాలని అధికారులకు సూచించారు. ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన దెందుకూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన పద్మావతి, ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం అగ్రహారం(భవాని) కాలనీ కి చెందిన మలిశెట్టి సాంబశివరావు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు. వైరా ఏరు , కట్టలేరు నది ఉప్పొంగడంతో మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. వరద నష్టం నివేదికలు రాగానే ప్రజలకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మాటూరుపేట దళితవాడలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. మాటూరుపేట బ్రిడ్జి ఎస్టిమేషన్స్ పంపి పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ముదిగొండలో పీహెచ్సీని, అమ్మపేట గ్రామంలో ముంగేటి బంధం చెరువు కుంట ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఎత్తుని పెంచి కొత్తగా నిర్మించాలని, ఇందుకు సంబంధించి అంచనాలను సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు గత పది నెలలుగా విద్యుత్ స్తంభాలు వేయడం లేదని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేయగా అధికారుల తీరుపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.