మధిర, వెలుగు: స్వయం సహాయక సంఘాల మహిళకే కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు డివిజన్లో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఒక్కరోజే మధిర మున్సిపాలిటీ పరిధిలో 10,272 చీరల పంపిణీ చేసినట్లు తెలిపారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేల మంది స్వయం సహాయక సభ్యులు ఉన్నారని, మరో 5వేల మంది చేరాల్సిన అవసరం ఉందన్నారు.
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరితే వడ్డీ లేని రుణాలతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. మధిరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏడాది కాలంలో పూర్తి అవుతాయని, మధిరను మార్చడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
రోడ్డు భద్రత అవగాహన ఆడియో సీడీ ఆవిష్కరణ
వైరా : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ రూపొందించిన ప్రత్యేక ఆడియో సీడీని మంగళవారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి జగదీశ్, ఆర్టీఏ మెంబర్ వెంకన్న, వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ. వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన కళాకారుడు మోదుగు గోవింద్ రచించి, పాడిన ఈ పాటల సీడీని లాంచనంగా విడుదల చేశారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఎల్. రాజశేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు స్వర్ణలత, రవిచంద్ర, దినేశ్, సుమలత తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ. 3 కోట్లు
వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో డిప్యూటీ సీఎం భట్టి రూ.3 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు మేరకు కళాశాలలో 18 కొత్త తరగతి గదుల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా మధిర నుంచి ఖమ్మం వెళ్తున్న డిప్యూటీ సీఎంను ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కళాశాల లెక్చరర్లు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులంతా సమష్టిగా పనిచేసి 20కి 20 వార్డులను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, సీసీ కార్యదర్శి కట్ల రంగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్‌తో పాటు శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, కన్నెగంటి నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
