
హైదరాబాద్, వెలుగు: పవర్ సెక్టర్‌లో ట్రాన్స్‌ఫర్ పాలసీని రెండ్రోజుల్లో జారీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి పి. సదానందం నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎంను కలిసింది.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచర్లలో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్-1 కమర్షియల్ ఆపరేషన్ డేట్ డిక్లరేషన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు అసోసియేషన్ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టికి అభినందనలు తెలిపారు. అనంతరం పవర్ సెక్టర్‌లో సమగ్ర ట్రాన్స్‌ఫర్ పాలసీని అమలు చేయాలని అసోసియేషన్ నేతలు కోరగా.. డిప్యూటీ సీఎం రెండు రోజుల్లో ఈ పాలసీ జారీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెన్‌కో ఎన్. సురేశ్ కుమార్, ట్రాన్స్‌కో సెక్రటరీ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.