ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో సీఎంఆర్ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఈ వ్యవహారంపై కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వడ్లను పక్కదారి పట్టించిన వ్యవహారంలో మిల్లర్లకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని, కారకులైన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో వంద కోట్ల మేరకు సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టాయని, వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రభుత్వ, ప్రజల ఆస్తి అనే విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వడ్ల సేకరణ, మిల్లులకు తరలింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మిల్లుల నుంచి సీఎంఆర్‌ను రికవరీ చేస్తామని, బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క, పొంగులేటి హెచ్చరించారు.