ఇవాళ (నవంబర్ 25) అన్ని జిల్లాల్లో.. మహిళా సంఘాలకు వడ్డీ నిధులు పంపిణీ

ఇవాళ (నవంబర్ 25) అన్ని జిల్లాల్లో.. మహిళా సంఘాలకు వడ్డీ నిధులు పంపిణీ

3.50 లక్షల సంఘాలకు, రూ.304 కోట్ల నిధులు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి 
మండల, గ్రామ సమాఖ్యల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచన 
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీ)కు రూ.304 కోట్ల వడ్డీ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఒకేసారి నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడారు. 

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళ వారం ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ, సెర్ప్ సీఈవోలను భట్టి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మండల, గ్రామ సమాఖ్య ప్రతినిధులు పాల్గొనేలా చర్య లు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చింద న్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు, మూడు దఫాలుగా ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీ సభ్యులకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని, మంగళవారం (ఈ నెల 25న) మరోసారి పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంచబోతున్నామని ఆయన వివరించారు. 

చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు అద్భుతంగా నిర్వహించారని.. ప్రతి గ్రామానికి చీరలు చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విజయవంతం చేసినందుకు కలెక్టర్లను ఆయన అభినందించారు. వీసీలో మంత్రి సీతక్క, సీఎస్​ రామకృష్ణారావు పాల్గొన్నారు.