
- ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు: డిప్యూటి సీఎం భట్టి
- స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలివ్వండి
- రాష్ట్రస్థాయి బ్యాంకర్ల మీటింగ్లో ఆదేశాలు
- రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ. 30 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించినం
- బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది రికార్డని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇందిరమ్మ ఇండ్లకు వీలైనంత ఎక్కవగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వాలని, ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయొద్దని సూచించారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
తెలంగాణలో సగటు వ్యక్తి ఆదాయం రూ. 3.87 లక్షలకు చేరిందని, కర్నాటక, హర్యానాలను అధిగమించి ఐదేండ్ల తర్వాత ఈ ఘనత సాధించడం అభినందనీయమని చెప్పారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించడమే ఈ రికార్డుకు కారణమని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తున్నామని, రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ. 30 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించి.. బ్యాంకింగ్ చరిత్రలోనే రికార్డు సృష్టించామని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు లోన్లు ఇవ్వండి..
మొదటి క్వార్టర్‌లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 33.64% సాధించడం అభినందనీయమని భట్టి విక్రమార్క అన్నారు. బలహీనవర్గాల అభివృద్ధికి.. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర ఉందని, కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
అధిక సీడీ రేషియో గర్వకారణం
తెలంగాణ నిరంతరం అధిక క్రెడిట్డిపాజిట్ (సీడీ) రేషియోను కొనసాగిస్తుండటం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఈ త్రైమాసికంలో అది 126.50% గా ఉందని తెలిపారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలు ప్రారంభించడం, సామాజిక భద్రత, బీమా పథకాల కింద లబ్ధిదారులందరినీ చేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర ఉందని, సమగ్ర, సాంకేతిక ఆధారిత బ్యాంకింగ్ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాన్ని విజయవంతం చేసిన కన్వీనర్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అభినందించారు.
ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సహాయం పెంచండి
రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైటెక్స్‌లో నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా హ్యామ్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 13వేల కిలో మీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్రంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, ఈ రంగంలో రుణ లక్ష్యాలను 33.42% సాధించడం అభినందనీయమని చెప్పారు. సీజీటీ ఎంఎస్ఈ కవరేజ్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలను పెంచాలని బ్యాంకర్లను కోరారు.