ఒర్రకమ్మా..నువ్వేమన్ననాకు ఓటేసినావా?

ఒర్రకమ్మా..నువ్వేమన్ననాకు ఓటేసినావా?

తార్నాక (హైదరాబాద్), వెలుగు: హైదరాబాద్​లో వరద ముంపు బాధితులపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఓటు వేయడానికి మేం పనికొస్తాం. కానీ బాధల్లో ఉంటే ఆదుకోవడానికి రారా? మూడురోజులు నీళ్లల్లో ఉన్నం.. ఇన్ని రోజులుకు వస్తారా” అని నిలదీసిన మహిళను ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘‘ఒర్రకమ్మా.. ఉండూ.. నువ్వేమన్న నాకు ఓటేసినవా..?” అంటూ సీరియస్ అయ్యారు. శనివారం తార్నాక డివిజన్ లాలాపేటలో డిప్యూటీ స్పీకర్​పద్మారావుగౌడ్ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ సరస్వతి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి లాలాపేట, చంద్రబాబునాయుడునగర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. అయితే అడుగడుగానా స్థానిక మహిళలు ఆయన్ను నిలదీశారు. ‘‘ఇళ్లలోకి నీళ్లు వచ్చి తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నా ఇటువైపు చూడలేదు. పరిస్థితులు మామూలుగా మారాక ఇప్పుడు వస్తారా” అంటూ కొందరు ప్రశ్నించారు. ‘‘వాన నీళ్లొస్తేనే మీరొస్తారు సారూ.. ఇది ఎప్పుడూ ఉండే కథే కదా. ఇంతకంటే ఏముంటుంది” అని ఇంకొందరు అన్నారు. స్పందించిన పద్మారావు.. ‘‘లారీలో బియ్యం వస్తున్నాయి. అందరికి పంచి పోతాం” అని వివరించే ప్రయత్నం చేశారు. ‘‘మీరు పంచే బియ్యం గురించి ఎదురు సూడాల్నా? మూడు రోజుల నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు లారీల్లో బియ్యం వస్తున్నాయని చెబుతున్నరు. బియ్యం లారీలు వచ్చుడు మీదనే ఉన్నాయా?” అని మండిపడ్డారు. దీంతో చాలా మందిని పరామర్శించకుండానే పద్మారావు ముందుకు కదిలారు. ఓ వృద్ధుడు వర్షానికి కూలిపోయిన తన ఇంటి ప్రహరీ గోడను చూపించేందుకు ఎదురు చూస్తుండగా, ఆయన్ను పట్టించుకోకుండా పద్మారావు, కార్పొరేటర్, అధికారులు వెళ్లిపోయారు. ‘‘నా బాధలు చెప్పుకుందామంటే కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయిన్రు. ఇగ వచ్చుడెందుకు? వెళ్లుడెందుకు?” అని పెద్దాయన వాపోయారు.