పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌ ఇచ్చేందుకు రూ. 10 వేల లంచం..డిప్యూటీ తహసీల్దార్‌‌ను పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌ ఇచ్చేందుకు రూ. 10 వేల లంచం..డిప్యూటీ తహసీల్దార్‌‌ను పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

కోటపల్లి, వెలుగు : పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన డిప్యూటీ తహసీల్దార్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన గంట నరేశ్‌‌ తండ్రికి కోటపల్లి మండలంలోని రాజారం గ్రామంలో 20 గుంటల భూమి ఉంది. ఈ భూమికి పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌ రాకపోవడంతో మీ సేవలో అప్లై చేసిన నరేశ్‌‌.. తర్వాత తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో సంప్రదించాడు. 

రూ. 15 వేలు ఇస్తే పాస్‌‌బుక్‌‌ వస్తుందని డిప్యూటీ తహసీల్దార్‌‌ నవీన్‌‌కుమార్‌‌ చెప్పాడు. దీంతో అంత ఇచ్చుకోలేనని నరేశ్‌‌ వేడుకోవడంతో రూ.10 వేలకు బేరం కుదిరింది. తర్వాత నరేశ్‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో నరేశ్‌‌ శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌‌ను కలిసి రూ. 10 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు నవీన్‌‌కుమార్‌‌తో పాటు తండ్రి స్థానంలో అటెండర్‌‌గా పనిచేసేందుకు వచ్చిన అంజి అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.