జస్టిస్‌‌ సుదర్శన్‌‌ రెడ్డికి మద్దతివ్వండి ..రాజ్యాంగాన్ని కాపాడిన వారిని గెలిపించండి: హరగోపాల్

జస్టిస్‌‌ సుదర్శన్‌‌ రెడ్డికి మద్దతివ్వండి ..రాజ్యాంగాన్ని కాపాడిన వారిని గెలిపించండి: హరగోపాల్

హైదరాబాద్‌‌, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్‌‌ బి.సుదర్శన్‌‌ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, పౌర సమాజం తరఫున దేశవ్యాప్తంగా ఎంపీలందరికీ లేఖలు రాస్తామని ప్రొఫెసర్‌‌ హరగోపాల్‌‌ ప్రకటించారు. ఈ ఎన్నిక వ్యక్తిగత ప్రతిష్టతకు, రాజ్యాంగ విలువలకు మధ్య జరుగుతున్న పోటీగా భావించాలని, ఎంపీలు ఏ వైపు నిలబడతారో గమనించాలని కోరారు. 

సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో సోమవారం తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో జస్టిస్‌‌ సుదర్శన్‌‌ రెడ్డికి మద్దతుగా, అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్వహించిన రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

రాజ్యాంగంలో ఎక్కడా పార్టీలకు మాత్రమే ఓటు వేయాలనే నిబంధన లేదని, కనుక రాజ్యాంగ విలువలను గౌరవించే జస్టిస్‌‌ సుదర్శన్‌‌ రెడ్డిని ఎన్నుకోవాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేయాలని కోరారు. 

‘సల్వాజుడుం అనే ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆదివాసీలను చంపేశారు. దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇచ్చింది’ అని అన్నారు. వీటిపై అవగాహన లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా దిగజారి మాట్లాడడం బాధాకరమన్నారు. సుదర్శన్‌‌ రెడ్డి ప్రజల పక్షాన పనిచేశారని తెలిపారు. ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే రాజ్యాంగం, విలువల మధ్య చర్చ తారాస్థాయికి చేరిందన్నారు. 

రాజ్యాంగ విలువల ప్రకారం నడవాలి: కోదండరాం

‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విషయంలో ఘర్షణ ఏర్పడుతున్నప్పుడు మనం ఎటువైపో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువల ప్రకారం అధికారం నడవాలని కోరుకునేవారు కచ్చితంగా సుదర్శన్ రెడ్డి వైపు నిలబడాలి’ అని కోదండరాం అన్నారు. ప్రస్తుతం సంప్రదాయం పునాదుల మీద, బలప్రయోగం ఆధారంగా అధికారం చెలాయించబడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు అధికారాలకు సమాజం పట్ల బాధ్యత ఉండదన్నారు. ఇలాంటి వాటిని అంబేద్కర్‌‌ గుండాయిజంతో పోల్చారని చెప్పారు.

గెలుపును అడ్డుకునేందుకే అమిత్‌‌ షా కామెంట్లు: జస్టిస్‌‌ చంద్రకుమార్‌‌    

సుదర్శన్‌‌ రెడ్డి గెలుపును అడ్డుకోవడం కోసమే అమిత్‌‌ షా నక్సలైట్ల పేరుతో కామెంట్లు చేశారని రిటైర్డ్‌‌ జడ్జి జస్టిస్ చంద్రకుమార్‌‌ అన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా ఏ ఆర్డినెన్స్‌‌ తెస్తే, ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే వాటిని కొట్టివేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉందన్నారు. 

సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తుల సంస్థలతోపాటు చివరికి ఎన్నికల కమిషన్‌‌ను కూడా బీజేపీ తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నదని ఆరోపించారు. పాత్రికేయులు ఎంఎం రహమాన్‌‌ దీనికి అధ్యక్షత వహించగా.. మీడియా అకాడమీ చైర్మన్‌‌ కె శ్రీనివాస్‌‌ రెడ్డి, సీనియర్‌‌ జర్నలిస్టులు రామచంద్ర మూర్తి, దేవులపల్లి అమర్, ఎన్‌‌ వేణుగోపాల్‌‌, పీఎల్‌‌ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్‌‌ డీఎల్‌‌, పాశం యాదగిరి, బీఎస్‌‌ రాములు, సయ్యద్‌‌ రఫీ, రాఘవాచారి, విరహత్‌‌ అలీ తదితరులు పాల్గొన్నారు.