ట్రాక్టర్ ర్యాలీపై ముందుకే

ట్రాక్టర్ ర్యాలీపై ముందుకే
  • పార్లమెంటులో అగ్రిచట్టాలు రద్దయ్యేదాకా వెనక్కి తగ్గబోం
  • 29న స్టార్ట్ చేస్తాం.. వింటర్ సెషన్ మొత్తం కొనసాగిస్తం 
  • రోజూ 500 మందితో ర్యాలీ నిర్వహిస్తం: ఎస్కేయూ
  • 22న లక్నోలో మహాపంచాయత్, 26న సింఘూ బార్డర్ లో ప్రొటెస్టులు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలను పార్లమెంటులో రద్దు చేసేదాకా ధర్నాలు, ర్యాలీలు, ఇతర నిరసన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. శనివారం సింఘూ బార్డర్ లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కోర్ కమిటీ మీటింగ్ లో ఆయా సంఘాల నేతలు పాల్గొని చర్చలు జరిపారు. ఈ నెల 29 దాకా నిర్ణయించిన ప్రోగ్రాంలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం కోర్ కమిటీ మీటింగ్ తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ మీడియాతో మాట్లాడారు. ఎస్కేఎం ఆధ్వర్యంలో జరపాలని ఇదివరకే నిర్ణయించిన ప్రోగ్రాంలలో ఎలాంటి మార్పు లేదని, ఆయా తేదీల్లో వాటిని యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నెల 22న లక్నోలో మహా పంచాయత్, 26న సింఘూ బార్డర్ లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. 29న పార్లమెంటుకు నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందని, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ ప్రతిరోజూ 500 మందితో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. మద్దతు ధరకు గ్యారంటీ, రైతులపై కేసుల రద్దు, నిరసనల్లో చనిపోయిన రైతుల స్మారకార్థం మెమోరియల్ ఏర్పాటు వంటి అంశాలపై మీటింగ్ లో చర్చించామని చెప్పారు. ప్రభుత్వం తమతో చర్చలకు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ అంశాలను లేవనెత్తుతామని వెల్లడించారు. కేంద్రం ఇంతకుముందే అగ్రిచట్టాలను రద్దు చేయాల్సిందని, ఉద్యమం ఎక్కువకాలం కొనసాగిన కొద్దీ రెండు పక్షాలకు నష్టం పెరుగుతుందన్నారు.  

ఇయ్యాల మరోసారి మీటింగ్..

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, విద్యుత్ బిల్లుల ఉపసంహరణ వంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఆదివారం మరోసారి భేటీ కావాలని ఆయా సంఘాల నేతలు నిర్ణయించారు. పార్లమెంటులో అగ్రిచట్టాలను రద్దు చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తాము నిర్ణయించుకున్న కార్యక్రమాలను కొనసాగిస్తామని రైతు నాయకుడు, ఎస్‌‌కేఎం కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు దర్శన్‌‌ పాల్‌‌, భారతీయ కిసాన్‌‌ యూనియన్‌‌ (ఉగ్రహాన్‌‌) ప్రెసిడెంట్‌‌ జోగిందర్‌‌‌‌ సింగ్‌‌ చెప్పారు. సాగు చట్టాల రద్దుపై ప్రధానితీసుకున్న నిర్ణయాన్ని రైతులు నమ్మడంలేదని, 
వన్‌‌ ర్యాంక్‌‌ వన్‌‌ పెన్షన్‌‌ ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అమలు కాలేదని ఎస్‌‌కేఎం నేత సుదేశ్ గోయత్‌‌ అన్నారు. అందుకే ట్రాక్టర్‌‌‌‌ ర్యాలీ వెనక్కి తీసుకోవడంలేదన్నారు. సాగు చట్టాలను రాజ్యాంగబద్ధంగా విత్‌‌డ్రా చేసుకునే వరకు తాము బార్డర్‌‌‌‌లలోనే ఉంటామని 
ఆమె స్పష్టం చేశారు.

రైతుల డిమాండ్లు తీర్చాలె

పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్న రైతుల డిమాండ్​ను నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కోరారు. అలాగే, లఖీంపూర్ ఖేరీ హింస కేసుకు సంబంధం ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపైనా చర్యలు తీసు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వరుణ్ గాంధీ.. మోడీకి శనివారం లేఖ రాశారు. సాగు చట్టాలు రద్దు చేయడాన్ని స్వాగతిం చిన ఆయన.. ఇది ముందే తీసుకుంటే ఉద్యమంలో 700 మందికిపైగా రైతుల ప్రాణాలు పోయేవికావన్నారు. అమరులై న ఒక్కో రైతు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, రైతుల మీద పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర డిమాండ్ తీర్చేదాకా వాళ్ల కోపం చల్లారదని, దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతుల కోసం వాళ్ల డిమాండ్లు నెరవేర్చాలని వరుణ్ గాంధీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.