చర్చలతోనే శాంతి .. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, బైడెన్

చర్చలతోనే శాంతి .. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, బైడెన్
  • రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, బైడెన్ 
  • రక్షణ రంగంలో భాగస్వామ్యం పెంచుకుందాం  
  • వర్చువల్ గా భేటీ అయిన నేతలు  

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న చర్చలు శాంతి నెలకొనే దిశగా దారి చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించేందుకు ఇరు దేశాలూ కలిసి పని చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 9 గంటలకు (అమెరికా టైం ప్రకారం సోమవారం ఉదయం) మోడీ, బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లోని బుచా నగరంలో అమాయక ప్రజలను ఊచకోత కోసిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తాము వెంటనే ఖండించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశామన్నారు. సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలకు మందులు, ఇతర రిలీఫ్ మెటీరియల్ అందిస్తూ ఇండియా చేస్తున్న మానవతా సాయాన్ని మెచ్చుకున్నారు. 

న్యూఢిల్లీ/వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న చర్చలు శాంతి నెలకొనే దిశగా దారి చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించేందుకు ఇరు దేశాలూ కలిసి పని చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 9 గంటలకు (అమెరికా టైం ప్రకారం సోమవారం ఉదయం) మోడీ, బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ‘‘నిరుడు సెప్టెంబర్ లో నేను వాషింగ్టన్​ వచ్చినప్పుడు.. ఇండియా, అమెరికా భాగస్వామ్యం అనేక ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతుందని మీరు (బైడెన్) అన్నారు. దానితో నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, అమెరికా నేచురల్ పార్ట్​నర్లు’’ అని అన్నారు. ‘‘ఉక్రెయిన్​లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మీరు చూపిన చొరవతో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. బుచా నగరంలో అమాయక ప్రజలను ఊచకోత కోసిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ ఘటనను ఇండియా వెంటనే ఖండించింది. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది” అని మోడీ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలోదిమిర్ జెలెన్ స్కీలతోనూ తాను మాట్లాడానని, నేరుగా కలిసి చర్చలు జరపాలని సూచించానని తెలిపారు.హింసకు ముగింపు పలకాలని కూడా వారిని కోరినట్లు తెలిపారు. 

శాంతివైపే నిలబడినం.. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా తటస్థంగా, శాంతివైపే నిలబడిందని మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పౌరుల క్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే వారికి రిలీఫ్​మెటీరియల్ లో ఆటంకం కలగకుండా సాయం అందేలా ప్రయత్నం చేశామన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో ఇండియా తటస్థంగా ఉండటం, రష్యా తీరును ఖండించకపోవడం, ఆంక్షలను కాదని గ్యాస్, చమురు కొనుగోలు చేయడంపై ఇటీవల అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలకు మందులు, ఇతర రిలీఫ్ మెటీరియల్ అందిస్తూ ఇండియా చేస్తున్న మానవతా సాయాన్ని స్వాగతించారు. యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను, అస్థిరత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో అమెరికా, ఇండియా ఇకపైనా కలిసి ముందుకు సాగుతాయని చెప్పారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందన్నారు. మే 24న జపాన్ లో జరిగే క్వాడ్ సదస్సులో మళ్లీ కలుద్దామని మోడీతో చెప్పారు.  

ఇరుదేశాల మధ్య 2+2 డైలాగ్

వాషింగ్టన్​లో ఈ నెల 10 నుంచి 15 వరకూ జరగనున్న 4వ ‘ఇండియా–యూఎస్ 2+2 డైలాగ్’ సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారమే అమెరికా వెళ్లారు. సోమవారం ఉదయం (అక్కడి టైం ప్రకారం) అమెరికా రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్​లతో పాటు వైట్​హౌస్​లో ప్రెసిడెంట్ బైడెన్​ను కలిశారు. మోడీతో వర్చువల్ మీటింగ్​లో బైడెన్​తో పాటు నలుగురు మంత్రులు కూడా పాల్గొన్నారు. అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ తరణ్ జిత్ సింగ్ సంధూ కూడా మీటింగ్​కు హాజరయ్యారు.