
- వరదలపై పాక్ను అలర్ట్ చేసిన భారత్
- రెండు దేశాల మధ్య టెన్షన్లు ఉన్నప్పటికీ మానవత్వం చాటుకున్న ఇండియా
- భారత్ సాయంపై పాక్ మీడియాలో వార్తలు
ఇస్లామాబాద్: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్ ఆ దేశానికి ఒక పెద్ద ఆపదను తప్పించి మానవత్వం చాటుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని తావి నదిలో ప్రమాదకర స్థాయిలో వరద ఉందని ఆదివారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ పాకిస్తాన్‌కు సమాచారం అందించింది. దీంతో అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించగలిగారు. గతంలో ఉన్న సింధూ జలాల ఒప్పందం మేరకు ఈ తరహా సమాచారం అందజేసేవారు. కానీ పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తర్వాత భారత్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది.
జలాల సమాచారాన్ని పాక్‌తో పంచుకోవడం ఆపేసింది. అయితే తాజాగా తావి నదిలో వరదలకు సంబంధించిన హెచ్చరికను భారత హైకమిషన్ ద్వారా పాక్‌కు తెలియజేయడం గమనార్హం. జమ్మూ, ఉధంపూర్మీదుగా ప్రవహించే తావి నది బార్డర్ దాటిన తర్వాత పాకిస్తాన్లో చీనాబ్ నదిలో కలుస్తుంది. పాకిస్తాన్ అధికారులు ఈ సమాచారం ఆధారంగా తమ దేశంలో హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తుగా పెద్ద సంఖ్యలో జనాన్ని వరదల ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. ఈ విషయంపై పాకిస్తాన్‌కు చెందిన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌లో ఈ ఏడాది వర్షాకాలం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. జూన్ 26 నుంచి కుండపోత వర్షాలతో ఆ దేశంలో 788 మంది మరణించారు. వెయ్యికి పైగా గాయపడ్డారు.