- రూ.12,450 కోట్లకు రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్
- రూ.22 వేల కోట్ల‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’కు గానూ వచ్చింది రూ.1,996 కోట్లే
- ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోరూ.1.22 లక్షల కోట్లు రాబడి
- ఈ కాలంలో ఏకంగారూ.19,561.75 కోట్లు ఖర్చు
- కాగ్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్ , వెలుగు :రాష్ట్ర ఆదాయంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఖజానాను రెవెన్యూ లోటు వెంటాడుతున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల ఆర్థిక నివేదికలో రాష్ట్ర మొత్తం రాబడులు రూ. 1.22 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ రెవెన్యూ వ్యయం అంచనాలను మించిపోయింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా రూ. 12,452.89 కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాల్లో రూ. 2,738.33 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని భావించగా, వాస్తవంలో రూ. 12,452.89 కోట్ల లోటు నమోదైంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో భారీ కోతలు కూడా రెవెన్యూ డెఫిసిట్ పెరగడానికి ఓ కారణమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది గ్రాంట్ల రూపేణా రూ. 22,782.50 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, సెప్టెంబర్ 2025 నాటికి కేవలం రూ. 1,996.77 కోట్లు (8.76%) మాత్రమే రాష్ట్రానికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–-25) ఇదే కాలంతో పోలిస్తే గ్రాంట్ల శాతం బాగా తగ్గింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఇతర బాండ్ల ద్వారా రూ. 45,139.12 కోట్లను సేకరించింది. ఇది మొత్తం మూలధన రాబడుల్లో 83.58% గా ఉంది. కాగ్ తాజాగా రిలీజ్ చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
రాబడులు ఇలా..
ఏప్రిల్ నుంచి ఆరు నెలల్లో రూ. 1.22 లక్షల కోట్ల రాబడులు నమోదయ్యాయి. ఇది మొత్తం బడ్జెట్ అంచనాల్లో 42.87% గా ఉంది. ఇందులో రెవెన్యూ వసూళ్లు రూ. 76,940.95 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 71,836.66 కోట్లుగా ఉంది. ఈ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 40.97 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ ) రూ. 25,411.39 కోట్లు, సేల్స్ ట్యాక్స్ రూ. 16,725.91 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు రూ. 9,620.91 కోట్లు వసూలయ్యాయి. ఇక పన్నేతర రాబడులు ( నాన్ ట్యాక్స్ రెవెన్యూ ) రూ. 3,107.52 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది బడ్జెట్‌లో 9.83% మాత్రమే! కీలకమైన మూలధన వ్యయం అంచనా రూ. 22,209.20 కోట్లకుగానూ 6 నెలల్లోనే ఏకంగా రూ. 19,561.75 కోట్లు(81.13% ) ఖర్చు చేయడం విశేషం. రాష్ట్ర ఆర్థిక భారంలో మరొకటి ప్రైమరీ డెఫిసిట్.. వడ్డీ చెల్లింపులను మినహాయించిన తర్వాత మిగిలే ఈ లోటు సెప్టెంబర్ నాటికి రూ. 30,768.48 కోట్లుగా ఉంది. దీనికితోడు అప్పులపై పెరుగుతున్న అధిక వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకు సవాల్‌గా మారింది. రాబోయే 6 నెలల్లో పన్నేతర ఆదాయాలు, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తేనే రాష్ట్ర ఖజానాకు కాస్త ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
