15 ఏళ్లైనా పూర్తికాని దేవాదుల..

15 ఏళ్లైనా పూర్తికాని దేవాదుల..
  • లక్ష్యం 60 టీఎంసీలు..పంపింగ్‌‌ 8 టీఎంసీలు
  • ఇంకా 5,579 ఎకరాల భూసేకరణ పెండింగ్
  • ఏఐబీపీ కింద సాయం అందిస్తున్న కేంద్రం
  • సముద్రం పాలవుతున్నగోదావరి నీళ్లు
  • ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వంలో నిర్లక్ష్యం

వరంగల్​ రూరల్​వెలుగు: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. రాష్ట్రంలో పరిచయం అక్కరలేని ప్రాజెక్ట్.. ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌ నోటి వెంట వినిపించే ప్రాజెక్ట్. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వాలు మారాయి.. 15 ఏళ్లు గడిచిపోయాయి.. దేవాదుల ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.. కేవలం రూ.3 వేలు కోట్లు ఖర్చు చేస్తే చాలు 6.21 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్‌‌‌‌ విభాగంలో రెండేళ్లలోనే పూర్తిచేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ గడువులు పెరుగుతున్నాయే తప్ప పనులు మాత్రం పూర్తవడం లేదు.

ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2004లో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించడంతో అంచనా వ్యయం రెట్టింపైంది. 2016 నాటికే రూ.13,445 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయినా ఏటా లక్ష ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి, రెండో దశలో చేపట్టిన మైనర్, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాలు, మూడో దశలో చేపట్టిన ఎనిమిది ప్యాకేజీల పనులు నామ్‌‌‌‌కే వాస్తే అన్నట్లు నడుస్తున్నయ్‌‌‌‌. అత్యంత ప్రధానమైన భీమ్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ నుంచి రామప్ప వరకు సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయి ఎనిమిదేండ్లు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం యాక్సిలరేటెడ్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ (ఏఐబీపీ) కింద ఇంజినీరింగ్‌‌‌‌ పనుల కోసం సాయం అందిస్తోంది. ఏటా ఖర్చుచేసిన మొత్తంలో 25 శాతం నిధులను కూడా సమకూరుస్తోంది.

సముద్రం పాలవుతున్న నీళ్లు

ఏటా జూన్‌‌‌‌ నుంచి ఆగస్టు వరకు కురిసే వర్షాలతో గోదావరిలో జలకళ ఉంటుంది. ఈ మూడు నెలల్లో మూడు దశలలో ఏర్పాటు చేసిన 10 మోటార్ల సాయంతో నీటిని పంపింగ్‌‌‌‌ చేసుకోవచ్చు. అయితే రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో పంపింగ్‌‌‌‌ చేసిన నీటి నిల్వ, పొలాలకు అందించే వీల్లేకుండా పోయింది. అధికారులు ఏటా మొదటి, రెండో దశ ద్వారా 8 టీఎంసీలకు మించి నీటిని పంపింగ్ చేయలేకపోతున్నారు. దీంతో గోదావరి జలాలన్ని సముద్రం పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేలు కోట్లు ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై వెచ్చిస్తే పనులు పూర్తి చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 6.21 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌పై శ్రద్ధ చూపకపోవడంతో గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు పెద్దగా కేటాయింపులు, ఖర్చు ఉండడం లేదు. ఏటా బడ్జెట్‌‌‌‌లో రూ.500 కోట్ల లోపే నిధులు కేటాయిస్తూ వస్తోంది. 365 రోజులు దేవాదుల ద్వారా గోదావరి నీటి పంపింగ్‌‌‌‌ కోసం రూ.2 వేల కోట్లతో తుపాకుల గూడెం బ్యారేజీ కూడా నిర్మిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌తో పాటే ఈ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటికీ 40 శాతం పనులు కూడా పూర్తికాలేదు.

మూడో దశ మరీ స్లో

దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌లో కీలకమైంది మూడో దశ పనులే. దీని ద్వారానే 40 టీఎంసీలకు పైగా నీటిని పంప్​ చేయాల్సి ఉంది. 2009లో మొదలైన ఈ పనులు చాలా స్లోగా సాగుతున్నాయి. ఇంటెక్‌‌‌‌ వెల్‌‌‌‌ నుంచి భీమ్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ వరకు రూ.1398 కోట్లతో మూడు వరసల పైప్‌‌‌‌ లైన్‌‌‌‌ పనులు మాత్రమే 95 శాతం పూర్తయ్యాయి. రెండో ప్యాకేజీ పనులు 60 శాతం జరగ్గా, మూడో ప్యాకేజీలో రూ.1494 కోట్లతో చేపట్టిన మూడో దశ పనులు 2011 నుంచి ఆగిపోయాయి. కేవలం 53 శాతం జరిగాయి. మేఘ కంపెనీ సొరంగ నిర్మాణ పనులు చేపడుతోంది. నాలుగో ప్యాకేజీ పనులు 86 శాతం, ఐదో ప్యాకేజీ పనులు 43.84 శాతం జరగ్గా ఆరో ప్యాకేజీ పనులు కేవలం 19 శాతం పూర్తయ్యాయి.  ఏడో ప్యాకేజీ పనులు 82 శాతం, ఎనిమిదో ప్యాకేజీ పనులు 66 శాతం పూర్తయ్యాయి. మొత్తం మూడో దశ కింద ఇప్పటివరకు రూ.4108 కోట్లు ఖర్చుచేశారు.

పెరుగుతున్న అంచనా వ్యయం

2016 నాటికి ప్రాజెక్టు వ్యయం రూ.13,445.44 కోట్లకు చేరింది. ఇప్పటికీ పూర్తికాకపోవడంతో 2019లో ఇది రూ.16 వేల కోట్లకు చేరుకోనున్నట్లు ఇరిగేషన్​ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మొదటి దశ పనులు 2005 లోనే పూర్తికావాలి. గడువు దాటి 14 ఏళ్లవుతోంది. అయినా ప్యాకేజీ 45, ప్యాకేజీ 46 పనులు పూర్తికాలేదు. రెండో దశ పనులు కూడా 2007 నాటికే పూర్తికావాల్సి ఉండగా ఇప్పటిదాకా అశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీ పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు. ఇక మూడో దశ పనులను  పరిశీలిస్తే ఇంకా దారుణంగా ఉంది. గడువు దాటినా కూడా ఎనిమిదో ప్యాకేజీల కింద పనులన్నీ కూడా పెండింగ్‌‌ లోనే ఉన్నాయి. పనులు పూర్తికాకపోవడంతో అధికారులు గడువులు(ఈవోటీ)లు పెంచుకుంటూ పోతున్నారు.

2020 జూన్‌‌ నాటికి పూర్తి చేస్తాం

దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2020 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడో దశ మూడో ప్యాకేజీ కింద చేపట్టాల్సిన సొరంగ నిర్మాణ పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. వీటిని గతంలో కోస్టల్‌‌ కంపెనీ చేపట్టేది ఇప్పుడు మేఘ కంపెనీకి పనుల బాధ్యత అప్పగించాం. అలాగే పెండింగ్‌‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరందిస్తాం.

– బంగారయ్య, చీఫ్ ఇంజినీర్, దేవాదుల ఎత్తిపోతల పథకం, వరంగల్