సిటీ శివారులోని వందలాది కాలనీల్లో కనిపించని అభివృద్ధి

 సిటీ శివారులోని వందలాది కాలనీల్లో కనిపించని అభివృద్ధి
  • కొన్ని ఏరియాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్ ఇవ్వలే
  • చాలా చోట్ల  నిలిచిపోయిన పనులు

ఎల్ బీనగర్, వెలుగు: సిటీ శివారు కాలనీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. కనీస సదుపాయాలు లేక వందలాది కాలనీల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, నీటి సదుపాయం కూడా లేని కాలనీలు ఎన్నో ఉన్నాయి. స్థానిక నేతలు, అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితులు అధ్వా
నంగా మారాయి.  పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని సాయిరెడ్డి కాలనీలో మూడు నెలల కిందట దొంగలు పడగా.. వానలకు రోడ్డు అధ్వానంగా మారడంతో పోలీసులు కాలనీలోకి రాలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక అనేక వీధులు కంపుకొడుతున్నాయి.

గుంతల్లో కిందపడి విరిగిన వృద్ధురాలి చేయి

హయత్ నగర్ శివారులోని లక్ష్మీ భవాని కాలనీ, కేవీఎన్ రెడ్డి నగర్ కాలనీ, శివం హిల్స్ కాలనీ, శ్రీ కృష్ణా హిల్స్, నందిహిల్స్, సిరి హిల్స్, గాయత్రి నగర్, టీనగర్ కాలనీ, ఎల్లారెడ్డి నగర్ కాలనీ ఫేజ్ 2, సాయి నగర్ కాలనీ, బ్యాంకు కాలనీ, రంగనాయకుల గుట్ట, బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బొల్లిగూడెం, చిన్న క్రాంతి కాలనీల్లో ఇంకా సీసీ రోడ్లు వేయలేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉండే చర్లపల్లి డివిజన్ నాగరాజు నగర్​లోనూ  రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. గుంతల కారణంగా ఇటీవల బురదలో కాలుజారి వృద్ధురాలు కిందపడగా ఆమె చేయి విరిగింది. బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి ఈ డివిజన్​కు కార్పొరేటర్​గా ఉన్నారు. ఈ డివిజన్​లో ఎప్పుడో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. మహేశ్వరం సెగ్మెంట్ బడంగ్ పేట, బాలాపూర్, అల్మాస్​గూడ, గుర్రం గూడలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సమస్యలపై ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని కాలనీల వాసులు వాపోతున్నారు. తమ వద్ద నుంచి అన్ని రకాల ట్యాక్స్​లు వసూలు చేసే జీహెచ్ఎంసీ, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడుతున్నారు.

ఎమర్జెన్సీ ఉన్నా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు

ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే కనీసం కాలనీకి అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సొంత డబ్బులతో మేము మా రోడ్లని తాత్కాలికంగా బాగు చేసుకుంటున్నాం.  ఇప్పటికైనా అధికారులు స్పందించి  సమస్యను పరిష్కరించాలి. – గుండె కిరణ్, సాయిరెడ్డి కాలనీ వైస్ ప్రెసిడెంట్, పెద్ద అంబర్​పేట

పాడైన రోడ్లతో నరకం చూస్తున్నం

20 ఏండ్లుగా ఈ ఏరియాలో ఉంటున్నా. ఇప్పటికీ మట్టిరోడ్డే ఉంది.  వాన పడినప్పుడు రోడ్డుపై గుంతలు ఏర్పడి నీరు నిలుస్తోంది. ఈ ఏడాది జులైలో బోనాల పండుగకు కార్పొరేటర్ రోడ్డుపై మట్టి పోయించారు. ఆ మట్టి కూడా వానకు కొట్టుకుపోయింది. పాడైన రోడ్లతో నరకం చూస్తున్నం. - భూలక్ష్మి, నాగార్జున కాలనీ, చర్లపల్లి డివిజన్

తాగు నీటి కోసం 2 కి.మీ వెళ్తున్నం

మా కాలనీలో 200 కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పటివరకు ఏ ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు.  తాగునీటి కోసం సుమారు 2 కి.మీ వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. - హర్ష, వైఎస్ఆర్ కాలనీ, అల్మాస్ గూడ