తూంకుంటలో అధికార పార్టీ నేతల అభివృద్ధి పనులు .. ఎన్నికల కోడ్ లేదా..?

తూంకుంటలో అధికార పార్టీ నేతల అభివృద్ధి పనులు .. ఎన్నికల కోడ్ లేదా..?
  • స్తంభాలకు గుంతలు తీసిన బినామీ కాంట్రాక్టర్లు 
  • హరితహారం కింద నాటిన చెట్ల నరికివేత

 శామీర్ పేట, వెలుగు : మేడ్చల్ కలెక్టరేట్ కు సమీపంలోని తూంకుంట మున్సిపాలిటీ 3వ వార్డులో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే  కొందరు బడా నేతలు ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రారంభించారు. మున్సిపల్   అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బడా నేతలు, బినామీ కాంట్రాక్టర్లు  కలిసి పనులు కొనసాగిస్తున్నారు. శామీర్ పేట మండలం తూంకుంట బిట్స్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 25 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 

స్థానికులు సమాచారం అందించినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం శోచనీయం. పని చేసే సిబ్బందిని అడిగితే.. మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి పేరు చెప్పడం గమనార్హం. స్తంభాల ఏర్పాటుకు హరితహారంలో నాటిన చెట్లను సైతం కాంట్రాక్టర్లకు చెందిన కార్మికులు నరికివేశారు. బిట్స్ కాలనీ కౌన్సిలర్ కు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ అధికార పార్టీ నేతలకు వర్తించదా..? అంటూ పలువురు ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.