
- తూప్రాన్, మనోహరాబాద్‌లో ఏండ్ల కింద అభివృద్ధి పనులు మంజూరు
- వర్క్స్‌లో కొనసాగుతున్న డిలే..
- అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు
మెదక్/తూప్రాన్/మనోహరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు చకచకా పూర్తవుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ నియోజకవర్గ పరిధిలోని మెదక్ జిల్లాలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఏండ్ల కింద మంజూరైన పలు పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.
తూప్రాన్‌లో ఇలా...
- తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఐదేండ్ల కిందనే రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. మొదట్లో స్థలం ఎంపికలో తర్జనభర్జన పడిన అధికారులు స్థలం ఖరారయ్యాక పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ల వద్ద నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ పిల్లర్లకే పరిమితమైంది. తూప్రాన్ పట్టణంలో పల్లె దవాఖానా మంజూరైనా స్థలం ఎంపిక కాకపోవడంతో నిర్మాణానికి అడుగు ముందుకు పడడం లేదు. వైద్యశాఖ అధికారులు స్థలం చూపించాలంటూ రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.
- సీఎం హామీ మేరకు తూప్రాన్ మున్సిపాలిటీకి రూ.25.25 కోట్లతో 504 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 440 పూర్తి కాగా, 64 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. పూర్తయిన ఇండ్లలోనూ మొత్తం లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.
- తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సుందరీకరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. గతంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, అప్‌గ్రేడ్ అయ్యాక మున్సిపాలిటీ పాలకవర్గం పలుమార్లు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.
మనోహరాబాద్‌లో...
- మనోహరాబాద్ మండలానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ నుంచి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. మంత్రి హరీశ్‌రావు 2022 మే 15న దండుపల్లి శివారులో 4.30 ఎకరాలలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఏడాది గడిచిన పనులు మాత్రం పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి కాకపోవడంతో ఆయా ఆఫీసులు అరకొర వసతులున్న అద్దె భవనాల్లో ఇబ్బందుల మధ్య కొనసాగుతున్నాయి.
- గడ నిధులు రూ.2 కోట్లతో చేపట్టనున్న పీహెచ్సీ బిల్డింగ్ నిర్మాణానికి తొమ్మిది నెలల కింద మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. ఆయన అధికారులతో పలుమార్లు సమీక్షించి ఆగస్టు వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా ఆ బిల్డింగ్ పని ఇంకా ప్లాస్టరింగ్ దశలో ఉంది.
- మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీ బిల్డింగ్‌లకు ఒక్కో దానికి రూ.35 లక్షల చొప్పున మంజూరయ్యాయి. కాగా వీటిలో ఆరు చోట్ల పనులు 90 శాతం వరకు పూర్తికాగా, కూచారం గ్రామంలో పనులు ఇంకా మొదలు కాలేదు. కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లిలో స్థలాల ఎంపిక పూర్తి కాకపోవడంతో గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ల పనులు ప్రారంభం కాలేదు.
స్పీడప్కు చర్యలు
మంజూరై ప్రారంభమైన డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మనోహరాబాద్ ఐఓసీ బిల్డింగ్ స్థల సేకరణలో జాప్యం కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యమయ్యాయి. ఆ పనులను తొందర్లోనే పూర్తి చేయిస్తాం. పీహెచ్సీ బిల్డింగ్ నిర్మాణం ఆగస్టు వరకు పూర్తవుతుంది. గ్రామ పంచాయతీ బిల్డింగ్‌లలో ఎక్కువ శాతం పూర్తి కావచ్చాయి. త్వరలో ప్రారంభిస్తాం.
- ముత్యంరెడ్డి, గడ స్పెషల్ ఆఫీసర్