సీఎం ఇలాకాలో అసంతృప్తిగా అభివృద్ధి పనులు..పట్టించుకోని అధికారులు

సీఎం ఇలాకాలో అసంతృప్తిగా అభివృద్ధి పనులు..పట్టించుకోని అధికారులు
  • నత్తనడకన రింగ్ రోడ్డు, బస్టాండ్, యూజీడీ, డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల పనులు 
  • ఇబ్బందుల్లో ప్రజలు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు 
  • ఆందోళనకు దిగుతున్న వివిధ పార్టీల నాయకులు 

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు :  సీఎం ఇలాకాలో సగం సగం అభివృద్ధి పనులతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ఏండ్ల కొద్దీ కొనసాగుతున్నాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనుల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గజ్వేల్​లో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 

పెండింగ్​లోనే రోడ్డు విస్తరణ పనులు

గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ నుంచి కోట మైసమ్మ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చాలా రోజుల కింద నిర్ణయించినా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రోడ్డు విస్తరణతో రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోతాయని ఆశపడిన స్థానికులకు నిరాశే మిగిలింది. 

మస్తు డిలే చేస్తున్రు.. 

గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు చేయడంలో మస్తు డిలే చేస్తున్రు. రింగ్ రోడ్డు పనులపై ఆఫీసర్లు శ్రద్ధ పెట్టడం లేదు. డబుల్​ బెడ్​రూమ్​ పంపిణీలో కూడా మస్తు నిర్లక్ష్యంగా ఉన్నరు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎట్లా? త్వరగా కంప్లీట్​ చేయాలె. 
- డీ.మనోహర్ యాదవ్, 
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు

మూడు నెలలన్నరు.. మూడేండ్లవుతోంది..

మూడు నెలల్లో గజ్వేల్  బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు మూడేండ్లు గడుస్తున్నా ఇంకా కంప్లీట్​ చేయలేదు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఉన్న బస్టాండ్ ను కూల్చి కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. తాత్కాలికంగా షెడ్ ను ఏర్పాటు చేసి బస్టాండ్ ను కొనసాగిస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 

యూజీడీ వర్క్స్​వెరీ స్లో.. 

మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులు 18 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా మూడేండ్లైనా ఇంకా కంప్లీట్​ కాలేదు. మొత్తం107 కిలో మీటర్ల మేర రూ.100 కోట్లతో ఈ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. మూడు విడతల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. మెయిన్ లైన్ పనులు పూర్తి కాగా, ఐదు వేల మ్యాన్ హోళ్లకు గాను ఇప్పటి వరకు మూడు వేల నిర్మాణాలు పూర్తిచేయగా ఇంటర్ కనెక్షన్లు ఎక్కువ సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి. 

రెండు నెలల్లో కంప్లీట్​ చేస్తాం

గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి  పనులన్నింటినీ రెండు నెలల్లో పూర్తి చేస్తాం. ఇప్పటికే యూజీడీ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. గజ్వేల్ రింగ్ రోడ్డు పెండింగ్​ పనులు కంప్లీట్​ చేసేలా చర్యలు చేపడుతున్నాం. కొత్త బస్టాండ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం. ఇండ్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నాం. 
- ముత్యంరెడ్డి, గడా
(గజ్వేల్ అర్బన్  డెవలప్​మెంట్ అథారిటీ) ఇన్​చార్జి

కొనసాగుతున్న ఆందోళనలు

గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి పనుల జాప్యంపై ఇటీవల బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానికులు మున్సిపాలిటీని ముట్టడించారు. ఇదే అంశంపై రానున్న రోజుల్లో ఇతర రాజకీయ పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరగా పనులను కంప్లీట్​చేయాలని పలువురు కోరుతున్నారు. 

దరఖాస్తులు తీసుకున్రు.. పంపిణీ మరిచిన్రు.. 

గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 1250 డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పంపిణీ  ప్రక్రియను మరిచిపోయారు. పట్టణానికి సమీపంలోని సంగాపూర్ వద్ద జీప్లస్ వన్ పద్ధతిలో రూ.150 కోట్ల తో ఈ ఇండ్ల ను నిర్మించి దాదాపు ఐదేండ్లు కావస్తోంది. వీటిని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. అయితే గతేడాది ఈ ఇండ్ల కోసం  3550 మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. అప్పటి నుంచి అర్హులను గుర్తించడం కోసం ప్రత్యేక టీమ్ లతో విచారణ జరిపించి లిస్టు తయారు చేసినా ఇప్పటికీ దాని అతీగతి లేదు. 

ఐదేండ్లుగా రింగ్ రోడ్డు పనులు

గజ్వేల్ పట్టణ  భవిష్యత్ అవసరాల కోసం రాజీవ్​ రహదారి నుంచి 22  కిలో మీటర్ల మేర  రూ.220  కోట్లతో  గజ్వేల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను 2017లో ప్రారంభించారు. 15 కిలో మీటర్ల మేర పనులు పూర్తాయినా మిగతా పనుల్లో జాప్యం కొనసాగుతోంది. రోడ్డుకు సంబంధించిన భూసేకరణపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో కొన్ని చోట్ల పనులు నిలిచిపోగా, మరికొన్ని చోట్ల స్లోగా జరుగుతున్నాయి. అయితే ఐదేండ్లు కావస్తున్నా ఇంకా పనులు కంప్లీట్​ కాకపోవడంపై పబ్లిక్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల్లో కంప్లీట్​ చేస్తాం

గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి  పనులన్నింటినీ రెండు నెలల్లో పూర్తి చేస్తాం. ఇప్పటికే యూజీడీ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. గజ్వేల్ రింగ్ రోడ్డు పెండింగ్​ పనులు కంప్లీట్​ చేసేలా చర్యలు చేపడుతున్నాం. కొత్త బస్టాండ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం. ఇండ్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నాం. 
- ముత్యంరెడ్డి, గడా
(గజ్వేల్ అర్బన్  డెవలప్​మెంట్ అథారిటీ) ఇన్​చార్జి

కొనసాగుతున్న ఆందోళనలు 

గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి పనుల జాప్యంపై ఇటీవల బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానికులు మున్సిపాలిటీని ముట్టడించారు. ఇదే అంశంపై రానున్న రోజుల్లో ఇతర రాజకీయ పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరగా పనులను కంప్లీట్​చేయాలని పలువురు కోరుతున్నారు.