బెల్లంపల్లిలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

బెల్లంపల్లిలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

బెల్లంపల్లి/ఆసిఫాబాద్/ ఆదిలాబాద్​ ఫొటోగ్రాఫర్, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకలకు గని ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయ ప్రసాద్ దంపతులు హాజరయ్యారు. గని టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది శాంతి ఖని బొగ్గుగనిలో నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ సిన్హా, సేఫ్టీ ఆఫీసర్ రాజు, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు దసరా పండుగ తర్వాతి రోజు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాపునగర్ శారద గణేశ్ మండలి వద్ద నెలకొల్పే అమ్మవారి విగ్రహాన్ని స్థానిక బస్టాండ్ ఎదుట నుంచి మహిళలు కోలాటాలతో తీసుకొచ్చారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. నిర్వాహకులు పుల్లూరి రవి, గీత, అశ్విన్, వివేక్, విలాస్, శ్రీనివాస్ గౌడ్, మహేందర్, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో భక్తుల రద్దీతో దుర్గామాత ఆలయాలు కిటకిటలాడాయి. దుర్గామాత మాలధారణ చేయడానికి క్యూ కట్టారు. బోజ్జావార్ టెంపుల్ లో ఏర్పాటు చేసే విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.