
ఒక ఇమేజ్ వచ్చాక ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి తటపటాయిస్తుంటారు కొందరు హీరోలు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ప్రయోగాలు చేయడానికి భయపడడు. మొదట్నుంచీ తాను చేసే పాత్రల విషయంలో వెరైటీని చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరింత డిఫరెంట్ రోల్స్‌ని ఎంచుకుంటూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ మగధ చక్రవర్తి ‘బింబిసార’గా రావడానికి రెడీ అవుతున్న కళ్యాణ్.. త్వరలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కూడా కనిపిస్తానంటున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని నిన్న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. మూవీకి ‘డెవిల్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.
పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, హ్యారీ పోటర్, ద డార్క్ నైట్ లాంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పని చేసి.. ‘బాబు బాగా బిజీ’ చిత్రంతో పాటు రీసెంట్‌గా ‘సిన్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా తెరకెక్కించిన నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. శ్రీకాంత్ విస్సా కథ అందించాడు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వం, బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బలమైన ప్రేమ, లోతైన మిస్టరీ ఉన్న ఓ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథ ఇది అంటోంది టీమ్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కళ్యాణ్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుంది. ఆ కాలం నాటి కాస్ట్యూమ్‌లో, కోర మీసాలతో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు కళ్యాణ్. రైల్లోంచి వేళ్లాడుతూ ఎవరికో తుపాకిని గురి పెట్టాడు. మొత్తంగా టైటిల్‌తోనే కాక కళ్యాణ్ లుక్‌తో కూడా సినిమాపై అంచనాలను ఏర్పరిచారు దర్శక నిర్మాతలు. దీనితో పాటు మరో రెండు సినిమాల అనౌన్స్‌మెంట్స్ కూడా నిన్న వచ్చాయి.
తనతో ‘118’ లాంటి మంచి థ్రిల్లర్‌ను తీసిన కేవీ గుహన్ డైరెక్షన్‌లో ఓ క్రైమ్ డ్రామాకి కమిటయ్యాడు కళ్యాణ్. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మహేష్ కోనేరు నిర్మాణంలోనూ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. వచ్చే యేడు సెట్స్‌కి వెళ్లనున్న ఈ సినిమా దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. మొత్తానికి ఒకేరోజు మూడు సినిమాల్ని అనౌన్స్ చేశాడంటే... కళ్యాణ్ రామ్ కెరీర్ ఏ స్పీడులో సాగుతోందో అర్థమవుతోంది.