అది కట్టడమా? లేక ప్రకృతి మలిచిన అందమా?

అది కట్టడమా? లేక ప్రకృతి మలిచిన అందమా?

అది చూడ్డానికి ఒక పెద్ద బురుజులా కనిపిస్తుంది. పొడవైన పెన్సిల్‌‌ ఆకారపు రాళ్లతో నిర్మించినట్టు ఉంటుంది. కానీ.. అది కట్టడమా? లేక ప్రకృతి మలిచిన అందమా? అనేది ఇప్పటివరకు తెలియలేదు. పైగా దాని చుట్టూ మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. కొందరు పెద్ద గుడ్డేలుగు ఎక్కడం వల్ల.. దాని గోళ్లు గీసుకుని అలా అయ్యిందంటారు! ఇంకొందరేమో యూఎఫ్​వోల ల్యాండింగ్‌‌ కోసం ఏలియన్లు తయారుచేసుకున్న ల్యాండింగ్‌‌ స్పేస్‌‌ అంటారు! ఇంతకీ అసలు కథేంటి? 

ఇక్కడ కనిపిస్తున్న కొండ పేరు డెవిల్స్ టవర్‌‌‌‌. ఇది అమెరికాలోని వయోమింగ్​ బెల్​ ఫూర్ష్​ నది దగ్గర్లో ఉంది. సముద్ర మట్టానికి 1267 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని చుట్టుపక్కల అడవులున్నాయి. అయితే.. ఈ అడవుల్లో ఇది ఎలా ఏర్పడిందనే విషయం మీద 1800 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జియాలజిస్ట్‌‌లు (భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు) రీసెర్చ్‌‌లు చేస్తూనే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ విషయం మాత్రం తేలలేదు. అంతేకాదు దీన్ని 1906లో అమెరికా గవర్నమెంట్‌‌ నేషనల్‌‌ మాన్యుమెంట్‌‌గా గుర్తించింది. ఇది చాలా అరుదైన ఫోనోలైట్ పోర్ఫైరీ రకం రాళ్లతో ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్తంభాల కలయిక ఇది అంటున్నారు సైంటిస్ట్‌‌లు. ఈ స్తంభాలు ఇప్పటివరకు విరిగిపోకుండా, విడిపోకుండా ఎలా ఉన్నాయనేది కూడా పెద్ద మిస్టరీనే. ఇది ఒక నిర్మాణం అనుకోవడానికి కూడా సరైన ఆధారాల్లేవు. పైగా రాతి పొరల్లో క్రినాయిడ్స్ లాంటి సముద్రపు మొక్కలు, బెలెమ్నైట్స్ లాంటి జీవుల శిలాజాలు ఉన్నాయి. 

పునాదులు
ఒక బిల్డింగ్‌‌కు పునాది ఉన్నట్టే ఈ కొండకు కూడా పునాది ఉంది. పునాదులు భూమిలో కొంత దూరం వరకు విస్తరించి ఉన్నాయి. గట్టిపడిన మినరల్స్‌‌, ఒక రకమైన ఆర్గానిక్‌‌ మెటీరియల్‌‌ ఈ పునాదుల్లో ఉంది. గాలి లేదా నీరు వల్ల ఇక్కడ మినరల్స్‌‌ గట్టిపడ్డాయని సైంటిస్ట్‌‌లు చెబుతున్నారు. అంటే, ఇక్కడ ఇంతకుముందు సముద్రం, లేదా పెద్ద నది ఉండి ఉండాలి. ఇలాంటి రాళ్లు ఎక్కువగా  నది డెల్టాలు, సముద్ర తీరాల్లో కనిపిస్తాయి. 

225 మిలియన్ల సంవత్సరాల క్రితం 
ఈ డెవిల్స్ టవర్‌‌‌‌ సముద్ర శిలలతో ఏర్పడి, ఆ రాళ్లు చాలా ఏళ్లపాటు సముద్రంలోనే మునిగి ఉన్నాయని చెబుతున్నారు. మరి వాటిని సముద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పేర్చారు? దాదాపు 225 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే.. ట్రయాసిక్ కాలంలో యునైటెడ్ స్టేట్స్‌‌ పశ్చిమ ప్రాతంలో ఎక్కువ భాగం సముద్రంలోనే మునిగి ఉండేదని దానివల్లే ఇవి ఏర్పడ్డాయని కొందరు అంటున్నారు. అదే నిజమైతే.. మరి ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లకు కూడా ఇవే లక్షణాలు ఉండాలి. కానీ.. లేవు. బెల్​ ఫూర్ష్ నదీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే ఇలాంటి రాళ్లు ఉన్నాయి. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది.  అవి ఎరుపు రంగులో ఉంటాయి. 

లోకల్​ కథనాలు 
ఈ కొండ చుట్టు పక్కల ఉన్న అడవుల్లో కియోవా, లకోటా అనే రెండు గిరిజన తెగలు ఉన్నాయి. అక్కడివాళ్లు చెప్పే కాథనాల ప్రకారం ఈ కొండ చాలా పవిత్రమైనది. సాక్షాత్తూ దేవతలే ఈ కొండను సృష్టించారని నమ్ముతారు.  వాళ్ల పురాణాల ప్రకారం... చాలా ఏళ్ల క్రితం కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటూ అడవిలో తిరుగుతున్నారు. అదే టైంలో వాళ్లకు పెద్ద గుడ్డేలుగులు కనిపించాయి. అవి వాళ్ల వెంటబడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇక లాభం లేదని ఒక రాయిపైకి ఎక్కి, మోకాళ్ల మీద కూర్చుని  గ్రేట్‌‌ స్పిరిట్‌‌(దేవత)ను ప్రార్థించారు. వెంటనే గ్రేట్ స్పిరిట్ ప్రత్యక్షమై, గుడ్డేలుగుల నుంచి ఆ అమ్మాయిలను కాపాడేందుకు వాళ్లు కూర్చున్న కొండను అమాంతం పైకి లేపింది. దాంతో గుడ్డేలుగులు ఆ కొండ చుట్టూ చేరి ఎక్కడానికి ప్రయత్నించాయి. అలా ప్రయత్నించినప్పుడు గుడ్డేలుగులు పంజా విసరడం వల్ల ఏర్పడిన గీతలే ఈ కొండ మీదున్న పొడవైన గుర్తులని, అవే ఇప్పటికీ ఉన్నాయని చెప్తారు. ఆ తర్వాత కూడా గుడ్డేలుగులు అక్కడినుంచి వెళ్లకపోవడంతో గ్రేట్‌‌ స్పిరిట్‌‌ ఆ అమ్మాయిలను ఆకాశంలో ఉన్న స్వర్గం వైపు తీసుకెళ్తే..  తర్వాత వాళ్లు నక్షత్రాలుగా మారారని చెప్పుకుంటారు.

మాటో నుంచి తప్పించుకోవడానికి 
ఈ కొండ విషయంలో మరో వెర్షన్‌‌ కూడా ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఊరికి దూరంగా తిరుగుతున్నప్పుడు ‘మాటో’ అనే పెద్ద గుడ్డేలుగు అక్కడికి వచ్చింది. పెద్ద స్తంభాల్లాంటి కాళ్లు ఉన్న ఆ భారీ జీవికి పదునైన గోళ్లు కూడా ఉన్నాయి. అయితే.. ఈ అబ్బాయిలు ముందుగానే దాన్ని గమనించి దైవాన్ని సాయం చేయమని ప్రార్థించారు. అప్పుడు దేవుడు వాళ్లున్న ప్రాంతంలో భూమి నుంచి ఒక పెద్ద రాతిని పైకి లేపాడు. అయినా మాటో వాళ్లను చంపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దాని పెద్ద పెద్ద గోళ్లతో ఆ కొండ ఎక్కేందుకు ప్రయత్నించడంతో దాని గోళ్ల గీతల గుర్తులు కొండపై పడ్డాయి. అవే కొండ స్తంభాలు నిర్మాణంలా కనిపించేందుకు కారణం. అందుకే ఈ కొండను చాలామంది ‘బేర్‌‌‌‌ బట్టె’ అని పిలుస్తుంటారు. ఆ తర్వాత అలసిపోయిన గుడ్డేలుగు అక్కడినుంచి వెళ్లిపోయింది. దాంతో ఒక పెద్ద డేగ వచ్చి వాళ్లను తీసుకెళ్లి ఊళ్లో దింపేసింది అని చెబుతారు. ఈ పురాణ కథను హెర్బర్ట్ ఎ. కాలిన్స్ అనే ఆర్టిస్ట్ పెయింటింగ్స్‌‌ ద్వారా చెప్పాడు. ఆ పెయింటింగ్స్ ఇప్పుడు డెవిల్స్ టవర్ దగ్గర ఉన్న విజిటర్స్‌‌ సెంటర్‌‌‌‌లో డిస్‌‌ప్లే చేశారు.

దాన్ని చంపేందుకే...
ఇక్కడి పురాణాల్లో మరో కథ కూడా చెప్పుకుంటారు. ఒక పెద్ద గుడ్డేలుగు రోజూవచ్చి, ఊరి జనాల మీద పడి ఇబ్బంది పెట్టేది. ఆ టైంలోనే ఆ ఊళ్లోని ఇద్దరు అక్కాచెల్లెళ్లు దాన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్‌‌ చేశారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. చంపలేకపోయారు. ఎన్నిసార్లు ఆయుధాలతో దాడి చేసినా.. దానికి గాయాలవ్వడంలేదు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మత పెద్దల దగ్గరకు వెళ్లారు.  ఆ గుడ్డేలుగు ప్రాణం దాని పాదాల్లో ఉందని, పాదాలకు గాయం చేస్తే అది చనిపోతుందని చెప్పారు. అయితే.. అది ఎదురుగా ఉన్నప్పుడు పాదాలకు గాయం చేయడం సాధ్యం కాదు. అందుకోసం వాళ్లు ఒక చక్కని ప్లాన్‌‌ వేశారు. ముందుగా అమ్మాయిలు ఆ గుడ్డేలుగు ముందునుంచి పరిగెత్తారు. దాంతో గుడ్డేలుగు వాళ్లను వెంబడించింది. వాళ్లు కొండ ఎక్కినట్టు గుడ్డేలుగుని నమ్మించి అక్కడినుంచి తప్పించుకుంటారు. అప్పుడు గుడ్డేలుగు ఆ కొండ ఎక్కేందుకు చేసిన ప్రయత్నంలో పడిన గీతలే ఇవి. అలా ప్రయత్నించేటప్పుడు గుడ్డేలుగు కొండమీద కాలు పెట్టి, ఎక్కుతున్నప్పుడు బాణాన్ని పాదంలో దింపి దాన్ని చంపేశారట.

యూఎఫ్​వోల కోసమా..
డెవిల్స్‌‌ టవర్‌‌‌‌ని యూఎఫ్​వోల కోసం ఏలియన్స్‌‌ నిర్మించాయని చాలామంది చెబుతుంటారు. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ జన సంచారం చాలా తక్కువగా ఉండేది. కాబట్టి భూమ్మీదకు వచ్చే ఏలియన్లు తమ వెహికల్స్‌‌ని ఇక్కడే ల్యాండ్ చేసేవి. ఈ కొండ  ఎక్కడం మనుషులకు సాధ్యం కాదు. కాబట్టి ఈ కొండ మీద వెహికల్‌‌ని ఉంచి, అవి కిందకి దిగేవట. అయితే.. ఈ కాన్సెప్ట్‌‌తో ఒక సినిమా కూడా వచ్చింది. అదే 1977లో వచ్చిన ‘క్లోజ్ ఎన్‌‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్‌‌’. ఈ సినిమాలో ఈ టవర్ మీద యూఎఫ్‌‌వో ల్యాండ్‌‌ అయినట్టు చూపించారు. 

పేరెలా వచ్చింది? 
దీన్ని 1875 నుంచి ‘డెవిల్స్‌‌ టవర్‌‌‌‌’ అని పిలుస్తున్నారు. ఆ పేరును కర్నల్ రిచర్డ్ ఇర్వింగ్ డాడ్జ్ అనే జియాలజిస్ట్ పెట్టాడు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడి గిరిజన తెగల ప్రజలు ‘‘ది బ్యాడ్ గాడ్స్ టవర్” అంటారు. దీని చుట్టూ గుడ్డేలుగుల కథలు అల్లడం వల్ల ‘‘బేర్ లాడ్జ్”అని కూడా పిలుస్తున్నారు. అయితే.. డెవిల్స్ టవర్ పేరును అధికారికంగా ‘‘బేర్ లాడ్జ్‌‌’’గా మార్చాలని స్థానిక తెగలు కోర్టులో పిటిషన్ వేశాయి. కియోవా తెగలోని కొందరు దీన్ని ‘‘ట్రీ రాక్’’ అని పిలుస్తుంటారు. కొందరు ‘‘ఘోస్ట్ మౌంటెన్” అంటారు. 

రాక్- క్లైంబింగ్ 
దీన్ని చూడ్డానికి చాలామంది టూరిస్ట్‌‌లు వస్తుంటారు. ఇది రాక్‌‌ క్లైంబింగ్‌‌కు స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌.  గతంలో ఇక్కడ పశువులు మేపేవాళ్లు చెక్క నిచ్చెనల సాయంతో రాళ్ల పగుళ్లను ఆధారంగా చేసుకుని కొండ ఎక్కేవాళ్లు. ఇప్పుడు క్లైంబింగ్ ఎక్విప్‌‌మెంట్‌‌తో చాలామంది ఎక్కుతున్నారు. సంవత్సరంలో దాదాపు ఆరువేల మంది దీన్ని ఎక్కుతున్నారు. అయితే... జూన్‌‌లో ఈ పర్వతాన్ని ఎక్కడానికి పర్మిషన్‌‌ ఉండదు. ఎందుకంటే... ఇక్కడ ఆ టైంలో స్థానికులు ఉత్సవాలు చేస్తుంటారు. 

::: కరుణాకర్​ మానెగాళ్ల