‘రిమ్స్’​లో వికటించిన ఇంజక్షన్

‘రిమ్స్’​లో వికటించిన ఇంజక్షన్

ఆదిలాబాద్​అర్బన్ , వెలుగు: ఆదిలాబాద్​ రిమ్స్ దవాఖానాలో సెఫటాక్సిమ్​ సోడియం అనే యాంటీబయాటిక్​ ఇంజెక్షన్​ వికటించి బుధవారం పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో వివిధ అనారోగ్య కారణాలతో ట్రీట్​మెంట్​తీసుకుంటున్న 30 మంది చిన్నారులకు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో  ఏఎన్​ఎంలు సెలైన్​ఎక్కించారు. దీంతోపాటు గోవా యాంటీబయాటిక్స్​అండ్​ ఫార్మాస్యుటికల్​లిమిటెడ్​(జీఏపీఎల్​) తయారు చేసిన సెఫటాక్సిమ్​ఇంజక్షన్​ను ఐవీ క్యానల్​ద్వారా వేశారు. అయితే అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో 10 మంది తీవ్రమైన చలితో వణికిపోవడంతో పాటు కడుపునొప్పి, తలనొప్పి లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. ఒకరిద్దరు వాంతులు చేసుకున్నారు. అక్కడి సిబ్బంది వెంటనే రిమ్స్​ డైరెక్టర్​ డా.బలరాం నాయక్​కు సమాచారం ఇచ్చారు.

ఆయన వెంటనే వార్డుకు చేరుకుని యాంటీ డోస్​ ఇప్పించారు. ఆయన పిల్లల డాక్టర్​కూడా కావడంతో వెంటనే పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. ఇలా ఎందుకు జరిగిందన్న విషయమై ఆయన మాట్లాడుతూ..‘ దవాఖానా అంతా సెఫటాక్సిమ్​వాడుతున్నాం. 30మంది చిన్నారులకు ఇంజక్షన్​ ఇస్తే 10 మందికి ఇలా జరిగింది. దీనిపై విచారణ జరిపిస్తున్నాం. వ్యాక్సిన్​లో ఏదైన బ్యాక్టీరియాల్​కంటామినేషన్​ జరిగిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పిల్లలకు వాడిన సిరంజీలు, వాయిల్స్, లిక్విడ్​లను మెడికల్​కాలేజీలోని మైక్రో బయాలజీ డిపార్ట్ మెంట్​కు పంపించాం.
వ్యాక్సిన్​తో సమస్య ఉందని రిపోర్టు వస్తే ఆ బ్యాచ్​ నెంబర్​ మందును పక్కనపెట్టేందుకు కూడా సిఫార్సు చేస్తాం. అడ్వర్స్​డ్రగ్స్​రియాక్షన్ (మెడిసిన్​పడకపోవడం వల్ల లేదా ఇతర మందులతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే రియాక్షన్) అనేదీ ఎప్పుడైనా జరుగవచ్చు. చిన్నారుల శరీర స్వభావ రీత్యా కూడా జరిగి ఉంటుందా అనేదాన్ని కూడా తెలుసుకుంటాం’ అని వెల్లడించారు. చిన్నారులంతా ప్రస్తుతం ఆరోగ్యంతోనే ఉన్నారని వారికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.