జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. సరస్వతీ అంత్య పుష్కరాల రెండో రోజు భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్దకు చేరుకున్నారు. త్రివేణి సంగమ తీరం వెంట ఇసుకతో సైతక లింగాలను తయారు చేసి పూజలు చేస్తున్నారు. గోదావరికి పసుపు, కుంకుమ, చీరె, సారె, ఒడి బియ్యం, దీపాలు దానం చేశారు. పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ను ఆదేశించారు.
గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు..
అంత్య పుష్కర స్నానమాచరించిన రాష్ట్ర గవర్నర్ శివపత్రాప్ శుక్లా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన దసలి పట్టు వస్ర్తాల స్టాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సరస్వతీ అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. సరస్వతీ ఘాట్ వద్ద కాశీ పండితులతో చేస్తున్న సరస్వతీ నవరత్న మాల హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిందని హర్షం వ్యక్తం చేశారు.
నవరత్నమాల హారతి ప్రత్యక్ష ప్రసారం..
కాశీ పండితులు నిర్వహిస్తున్న సరస్వతీ నవరత్నమాల హారతిని దేశ, విదేశాల్లోని భక్తులు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతి ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. శుక్రవారం రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా దంపతులు, ఖమ్మం జిల్లా మధిర జడ్జి కల్పన పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర మక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.
