మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
  •     చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగే అగ్నిగుండాల కార్యక్రమం తిలకించడానికి శనివారం సాయంత్రం నుంచే భక్తులు పోటెత్తారు. 

క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నుంచి స్వామికి అభిషేకాలు, అర్చనలు చేశారు. పట్నాలు వేసి, ఒడిబియ్యం పోసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మట్టి కుండలలో బోనం తయారు చేసి కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి, మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. రాతి గీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. 

స్వామివారి దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. కాగా స్వామివారిని కేధార్​నాథ్​ఆలయ ప్రధాన పూజారి శివలింగ స్వామి, వికారాబాద్ ఆలంపల్లిలోని కెంపిన మఠాధిపతి చెన్న బసవ ప్రభు మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఉద్యోగులు నర్సింహులు, అంజయ్య, ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.