ఇసుకేస్తే రాలనంత జనం..ఊపిరాడక భక్తులు మృతి

ఇసుకేస్తే రాలనంత జనం..ఊపిరాడక భక్తులు మృతి

నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో ఏం జరుగుతోంది. జాతర మూడు రోజులే ఎందుకు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం భక్తుల ఆగ్రహం..ఆవేదన ఇది.  సలేశ్వరంలో భక్తులు ఊపిరాడక మృతి చెందడంతో...ప్రభుత్వంతో పాటు..స్థానిక అధికారులపై మండిపడుతున్నారు.  నిజానికి సలేశ్వరం జాతర కనీసం 10 రోజులు లేదా కనీసం వారం పాటు జరగాలి. కానీ ఈ ఏడాది కేవలం మూడు రోజులే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో గ‌తంలో ఎన్నడూ రానంత భ‌క్తజనం ఈ ఏడాది స‌లేశ్వరం జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చారు. స‌లేశ్వరం ఆల‌యం దారి జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంత జనంతో సలేశ్వరం కొండలు కిక్కిరిశాయి. ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. అటు  మన్ననూర్ నుంచి స‌లేశ్వరం జాత‌ర‌కు వ‌చ్చే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభ‌మైంది. ఏప్రిల్ 7వరకు  కొన‌సాగ‌నుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలయింది.  సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.  ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతిస్తున్నారు.  పిల్లల నుంచి వృద్ధుల వరకు స్వామి దర్శనానికి వస్తున్నారు.  గతేడాది జాతరను వారం రోజుల పాటు అధికారులు నిర్వహించారు. కానీ ఈ ఏడాది మూడు రోజులకే అధికారులు కుదింపు చేయడంతో ఒక్కసారిగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో సలేశ్వరం కొండలు భక్తులతో కిక్కిరిసింది. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. మరికొందరు ఊపిరాడక చనిపోయారు. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. భక్తుల రాకకు తగ్గట్టుగా అధికారులు  ఏర్పాట్లు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు టోల్ గేటు రుసుము వసూలు  మీద చూపుతున్న శ్రద్ధ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.